కార్మికులకు అండగా లేబర్ అడ్డా.. ఎమ్మెల్యే
పాయకాపురం, అక్టోబర్ 6 (ఆంధ్రప్రభ): భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో లేబర్ అడ్డాను ఏర్పాటు చేయడం జరిగిందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎండకు ఎండి, వానకు తడుస్తూ రోడ్లపై నిలబడకుండా కార్మికులకు గుర్తింపు, గౌరవం కల్పిస్తూ ఒక స్థిరమైన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. మంగళవారం టీడీపీ శ్రేణులతో కలిసి కార్మికుల కోసం ఏర్పాటు చేస్తున్న లేబర్ అడ్డా భవనాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను తెలుసుకుని, వారి జీవన స్థితిగతులను మెరుగుపర్చే దిశగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో లేబర్ అడ్డాను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు కార్మికుల సమస్యలను తెలుసుకుని వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవన నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు గౌరవప్రదమైన వాతావరణం కల్పించడమే లేబర్ అడ్డా ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
