ఉత్సవాలు ప్రశాంతంగా సాగాలి: సీఎం రేవంత్‌

గణేశ్‌ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు!
వినాయ‌క మండపాలకు ఫుల్‌ సెక్యూరిటీ!
నిర్వాహకులు మండపాల వివరాలను పోలీసులకు ముందే అందించాలి..
ఉచిత విద్యుత్‌ కోసం అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి
నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లకు అనుగుణంగా ఏర్పాట్లు..
ఉత్సవాలు ముగిసే వరకు నిరంతర పర్యవేక్షణ
గణేశ్‌ ఉత్సవాలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ మహానగరంలో గణేశ్‌ ఉత్సవాలను ప్రశాంతంగా, సమన్వయంతో నిర్వహించేందుకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఆవరణలోని శాసన మండలి కాన్ఫరెన్స్‌ హాల్‌లో గణేశ్‌ ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

సమీక్షా సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అజారుద్దీన్‌, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, శ్రీగణేశ్‌తో పాటు జీహెచ్‌ఎంసీ, హైడ్రా, పోలీసు శాఖల ఉన్నతాధికారులు, ఇతర అధికారులు, గణేశ్‌ ఉత్సవ కమిటీ ప్రతినిధులు హాజరయ్యారు.

సమస్యలు తెలుసుకునేందుకే స్వయంగా సమీక్ష

గణేశ్‌ ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వాహకులు, అధికారులతో నేరుగా చర్చించేందుకే తాను సమీక్ష నిర్వహిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న సంప్రదాయాన్ని పునరుద్ధరించామని పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మండపాల వివరాలు పోలీసులకు ఇవ్వాలి

గణేశ్‌ మండపాల వద్దకు ప్రముఖులు, అతిథులను ఆహ్వానించినప్పుడు ఆ వివరాలను స్థానిక పోలీసు కమిషనరేట్‌కు ముందుగానే అందించాలని నిర్వాహకులకు సీఎం విజ్ఞప్తి చేశారు. అనుకోని పరిణామాలు చోటుచేసుకున్నప్పుడు తక్షణ చర్యలు చేపట్టేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే ఏయే ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తద్వారా ట్రాఫిక్‌ నియంత్రణ, బందోబస్తు, భద్రతా చర్యలను సమర్థంగా నిర్వహించేందుకు వీలవుతుందని తెలిపారు.

మండపాలకు ఉచిత విద్యుత్‌

దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్‌ మండపాలకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని సీఎం తెలిపారు. మండపాల నిర్వాహకులు సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకుని ఈ సౌకర్యాన్ని పొందాలని సూచించారు.

నిమజ్జన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మల కోసం ఏర్పాట్లు చేస్తున్న తరహాలోనే గణేశ్‌ నిమజ్జనాలకు అనుగుణంగా నిర్మాణ సమయంలోనే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. చెరువుల చుట్టూ నిమజ్జన ప్రక్రియలో ఉపయోగించే క్రేన్లను ఏర్పాటు చేసుకునేలా తగిన స్థలం, సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూం

గణేశ్‌ ఉత్సవాలు పూర్తయ్యే వరకు మున్సిపల్‌, పోలీసు శాఖలు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసుకుని ఉత్సవాల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. పర్యవేక్షణ, సమన్వయం కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని, వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు

హైదరాబాద్‌ నగరం ప్రశాంతంగా, సురక్షితంగా ఉంటేనే పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గణేశ్‌ ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అదే సమయంలో ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. భక్తుల భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ, నిమజ్జన ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణలో అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఎదురైనా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.