Cat-2026-Preparation-Tips : మాక్‌ టెస్టులే కీలకం ! Andhra Prabha Top Story

Cat-2026-Preparation-Tips : మాక్‌ టెస్టులే కీలకం ! Andhra Prabha Top Story

  • క్యాట్‌-2026లో సత్తాకు పునాది ..
  • ప్రశ్నల ఎంపిక నుంచి సమయపాలన వరకు
  • అభ్యర్థులు పాటించాల్సిన వ్యూహాలివే
  • మార్కులే కాదు.. తప్పులనూ విశ్లేషించాలి
  • నాలుగైదు పరీక్షల ఫలితాలను బేరీజుతో స్పష్టత

( న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి )

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌)-2026కు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇకపై మరింత వ్యూహాత్మకంగా సన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. కేవలం సబ్జెక్టులపై పట్టు, నిరంతర సాధన ఉంటే సరిపోదు.. పరీక్షలో ఏ ప్రశ్నలను ఎంచుకోవాలి? దేనికి ఎంత సమయం కేటాయించాలి? వేగం, కచ్చితత్వాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి? అన్న అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. ఈ విషయంలో మాక్‌ టెస్టులు కీలక పాత్ర పోషిస్తాయని రోధా వ్యవస్థాపకుడు, సీఈఓ రవి ప్రకాశ్‌ సూచిస్తున్నారు. అయితే మాక్‌ పరీక్షలు రాయడమే కాదు.. వాటి ఫలితాలను లోతుగా విశ్లేషించి, తప్పులను సరిదిద్దుకున్నప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని చెబుతున్నారు.

ప్రశ్నల ఎంపికే అసలైన నైపుణ్యం

పరీక్షలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్న ఆతృతతో అభ్యర్థులు చేసే ప్రయత్నం కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలనిస్తుంది. ప్రశ్న కఠినత, దాన్ని పరిష్కరించడానికి పట్టే సమయాన్ని అంచనా వేయకుండా ప్రయత్నించడం వల్ల విలువైన సమయం వృథా అవుతుంది. అందుకే ప్రశ్నల ఎంపికను ఒక ప్రత్యేక నైపుణ్యంగా అభివృద్ధి చేసుకోవాలి. తమకు తెలిసిన అంశమా? ప్రశ్నను పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుంది? సరైన సమాధానం వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? వంటి అంశాలను బేరీజు వేసుకోవాలి. ఎక్కువ శ్రమ, సమయం తీసుకునే ప్రశ్నలను అవసరమైతే వదిలేయాలి. ఒక ప్రశ్నకు కేటాయించే సమయానికి తగిన ఫలితం వస్తుందా లేదా అన్నది ముందుగానే అంచనా వేయడం ముఖ్యం.

మార్కులే కొలమానం కాదు

చాలామంది అభ్యర్థులు మాక్‌ టెస్టు పూర్తయిన తర్వాత వచ్చిన మార్కులపైనే ప్రధానంగా దృష్టి పెడతారు. కానీ ఆ స్కోరు ఎలా వచ్చింది? ఎక్కడ మార్కులు కోల్పోయారు? ఏ ప్రశ్నల దగ్గర పొరపాట్లు జరిగాయి? అన్న విషయాలను విశ్లేషించడం మరింత ముఖ్యం. సమాధానం తప్పిన ప్రశ్నలతోపాటు, ప్రయత్నించకుండా వదిలేసిన ప్రశ్నలనూ పరిశీలించాలి. లెక్కల్లో పొరపాట్లు జరిగాయా? ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారా? తప్పుడు ప్రశ్నను ఎంచుకున్నారా? సమయాన్ని సరిగా వినియోగించుకోలేకపోయారా? అన్న కారణాలను గుర్తించాలి. ఇలా ప్రతి మాక్‌ టెస్టును విశ్లేషిస్తే బలహీనతలు స్పష్టమవుతాయి.

పదే పదే వ‌చ్చే తప్పులను గుర్తించాలి

ఒకే తరహా పొరపాట్లు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయా? అన్నది అభ్యర్థులు గమనించాలి. ఉదాహరణకు, లెక్కల్లో తప్పుల కారణంగా ఎక్కువ ప్రశ్నలు వదిలేయాల్సి వస్తుంటే వేగం, కచ్చితత్వాన్ని పెంచుకోవడంపై సాధన చేయాలి. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ విభాగంలో కొన్ని సెట్లపైనే ఎక్కువ సమయం వెచ్చిస్తుంటే.. ఏ ప్రశ్నలను ఎంచుకోవాలి? వేటిని వదిలేయాలి? అన్న విషయంలో మరింత శిక్షణ పొందాలి.త‌ప్పులను కేవలం గుర్తించడం కాకుండా.. వాటికి కారణాలను విశ్లేషించి, మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవడమే అసలైన ప్రయోజనం.

వేగం.. కచ్చితత్వం మధ్య సమతూకం

ప్రయత్నించిన ప్రశ్నలపైనా అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఒక్కో ప్రశ్నకు ఎంత సమయం పట్టింది? అవసరానికి మించి సమయం వెచ్చించారా? అన్నది పరిశీలించాలి. కొన్నిసార్లు కఠినమైన ప్రశ్నను పరిష్కరించగలిగినా.. దానికోసం ఎక్కువ సమయం కేటాయించడం వల్ల మిగిలిన ప్రశ్నలకు సమయం సరిపోకపోవచ్చు. దీంతో మొత్తం పరీక్ష వ్యూహమే దెబ్బతింటుంది. ఒక ప్రశ్నకు నిర్ణయించిన సమయం కంటే ఎక్కువ వెచ్చించినా సమాధానం దొరకకపోతే.. దాన్ని వదిలేసి మరో ప్రశ్నకు వెళ్లడం మంచిది. అదే సమయంలో వేగం పెంచాలనే తొందరలో ప్రశ్నలను సరిగా చదవకుండా సమాధానాలు గుర్తించడం కూడా తప్పులకు దారితీస్తుంది. కాబట్టి వేగంతోపాటు కచ్చితత్వానికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.

సాధన.. విశ్లేషణ.. మెరుగుదల

మాక్‌ టెస్టుల ద్వారా నిరంతర అభివృద్ధి సాధించాలంటే ఒక క్రమబద్ధమైన విధానాన్ని అనుసరించాలి. దీనికి నాలుగు దశలు కీలకం. ముందుగా ఒక మాక్‌ టెస్టు రాయాలి. అందులో జరిగిన తప్పులు, బలహీనతలను విశ్లేషించాలి.మెరుగుపరచుకోవాల్సిన అంశాలపై ప్రత్యేకంగా సాధన చేయాలి.ఆ తర్వాత మరో మాక్‌ టెస్టు రాసి పురోగతిని పరిశీలించాలి.ఈ చక్రాన్ని నిరంతరం కొనసాగిస్తే పరీక్షా వ్యూహం క్రమంగా మెరుగుపడుతుంది. ఉదాహరణకు, ఎక్కువ ప్రశ్నలను ప్రయత్నిస్తున్నప్పటికీ సరైన సమాధానాలు తక్కువగా వస్తున్నట్లు గుర్తిస్తే.. తదుపరి మాక్‌ టెస్టుకు ముందు వేగం, కచ్చితత్వంపై ఎక్కువ సమయం కేటాయించాలి.ప్రతి పరీక్ష ఫలితాన్ని నమోదు చేసుకోవాలిఅభ్యర్థులు తమ మాక్‌ టెస్టుల ఫలితాలను స్ప్రెడ్‌షీట్‌ లేదా ప్రత్యేక జర్నల్‌లో నమోదు చేసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్ని ప్రశ్నలు ప్రయత్నించారు? వాటిలో ఎన్ని సరైన సమాధానాలు వచ్చాయి? కచ్చితత్వం ఎంత? కఠినమైన ప్రశ్నలకు ఎంత సమయం పట్టింది? వంటి వివరాలను నమోదు చేయాలి. కొన్ని పరీక్షల తర్వాత ఈ గణాంకాలను పరిశీలిస్తే తమ సన్నద్ధతలో వస్తున్న మార్పులు, పునరావృతమవుతున్న తప్పులు స్పష్టంగా తెలుస్తాయి. అయితే ఒక్క మాక్‌ టెస్టులో తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన మొత్తం ప్రిపరేషన్‌ వ్యూహాన్ని మార్చుకోవద్దని నిపుణుల సూచన. కనీసం నాలుగైదు మాక్‌ టెస్టుల ఫలితాలను పరిశీలించిన తర్వాతే ఒక అంచనాకు రావాలి. ఎందుకంటే ఒక్కోసారి పరీక్ష ఫలితాల్లో సహజంగానే హెచ్చుతగ్గులు ఉంటాయి.

మార్కుల కంటే సరైన వ్యూహమే ముఖ్యం

క్యాట్‌-2026 సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు క్రమం తప్పకుండా సాధన చేయడంతోపాటు, ప్రతి మాక్‌ టెస్టు నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాయడమే లక్ష్యంగా పెట్టుకోకుండా.. ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలి? ఏది ప్రయత్నించాలి? ఏది వదిలేయాలి? అన్న విషయాలపై స్పష్టత పెంచుకోవాలి. ఒక ప్రశ్నకు సమయం, శ్రమ వెచ్చిస్తే దానికి తగిన ఫలితం వచ్చే అవకాశాలున్నాయా? అన్నది బేరీజు వేసుకోవాలి. ఈ విధంగా సాధన, విశ్లేషణ, తప్పుల సవరణను కొనసాగిస్తే వేగం, కచ్చితత్వం పెరగడమే కాకుండా పరీక్షలో మెరుగైన ప్రదర్శనకు అవకాశం ఉంటుంది.