మదనపల్లి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : ఇటీవల ఉచ్చులో చిక్కుకుని చిరుత మృతిచెందిన ఘటనలో తమ వారిపై అన్యాయంగా కేసులు పెట్టారని, కేసుల నుంచి తమ వారికి విముక్తి కల్పించాలని కోరుతూ మదనపల్లి రూరల్ మండలం పొన్నూటిపాలెంకు చెందిన రైతులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేసుకున్నారు. ఆ రైతుల కుటుంబ సభ్యులు ఈరోజు శాసనమండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ ని కలిసి సంబంధిత వివరాలను తెలియజేశారు.
చిరుత చనిపోయిన ప్రాంతానికి ఆనుకుని ఉన్న భూమిని ప్రామాణికంగా చేసుకుని అటవీశాఖ అధికారులు తమ వారిని అరెస్టు చేసినట్టు తెలిపారు. చిరుత మృతిలో తమవారి ప్రమయం లేకున్నా విచారణ జరపలేదని, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని అయినా అప్పటికప్పుడు అరెస్టులు చేశారని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమ వారికి న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ఈ విషయాన్ని అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని ఈ సందర్భంగా రైతుల కుటుంబాలకు హరిప్రసాద్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన మదనపల్లె నియోజకవర్గ ఇంఛార్జి జి.రాందాస్ చౌదరి, ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ పాల్గొన్నారు.