YouTuber Madhumitha: కాంట్రాక్టర్ గొలుసు చోరీ.. యూట్యూబర్‌పై కేసు నమోదు
తమిళనాడు, ఆంధ్రప్రభ: తమిళనాడుకు చెందిన వివాదాస్పద యూట్యూబర్ మధుమిత మరోసారి వార్తల్లో నిలిచారు. ఒక వృద్ధుడి బంగారు గొలుసును చోరీ చేసి, ఆపై బెదిరింపులకు దిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరునెల్వేలి ప్రాంతానికి చెందిన 89 ఏళ్ల భవన నిర్మాణ కాంట్రాక్టర్ పేచ్చిముత్తుకు నాగర్‌కోవిల్‌లో నివసించే యూట్యూబర్ మధుమితతో గతంలో పరిచయం ఉంది. 2022లో వీరిద్దరూ ఒకే వాహనంలో ప్రయాణించిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మధుమితను బస్టాండ్ వద్ద దించి ఇంటికి వెళ్లిన తర్వాత, తన మెడలో ఉండాల్సిన 5 సవర్ల బంగారు గొలుసు కనిపించకపోవడాన్ని పేచ్చిముత్తు గుర్తించారు. సదరు నగల గురించి ఆయన మధుమితను ఫోన్లో నిలదీయగా, ఈ విషయాన్ని పోలీసుల వరకు తీసుకెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, సమాజంలో అవమానిస్తానని ఆమె బెదిరించినట్లు బాధితుడు పేర్కొన్నారు.
బాధితుడు ఇచ్చిన ఆధారాల మేరకు రాజాక్కమంగళం పోలీసులు మధుమితపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సోషల్ మీడియాలో విలాసవంతమైన జీవితాన్ని, భారీగా నగలు, నగదును ప్రదర్శిస్తూ వీడియోలు చేసే మధుమిత ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కేవలం రెండు వారాల క్రితమే ఆమె నివాసంలో సుమారు 118 సవర్ల బంగారం అపహరణకు గురైనట్లు సమాచారం. యూట్యూబ్‌లో ఆమె చూపిస్తున్న ఆదాయ మార్గాలు, నగల మూలాలపై సందేహాలు వ్యక్తమవ్వడంతో ఆదాయపన్ను శాఖ (IT) అధికారులు కూడా ఇప్పటికే విచారణ చేపట్టారు. ఈ కేసు నమోదు కావడంతో పోలీసులు ఆ నగలు ఎక్కడున్నాయనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు.
