శ్రీవిద్యా సాధనా కేంద్రం నిర్వాహకుడు చైతన్య గురూజీపై కేసు నమోదు

శ్రీవిద్యా సాధనా కేంద్రం నిర్వాహకుడు చైతన్య గురూజీపై కేసు నమోదు

అసభ్యకర సందేశాలు పంపినట్లు ఆరోపణలు..
బెదిరింపుల వ్యవహారంలో కోర్టును ఆశ్రయించిన బాధితుడు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆధ్యాత్మిక సాధనల పేరుతో మహిళను వేధించినట్లు వచ్చిన ఆరోపణలపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీసులు ఓ గురూజీపై కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 71లో శ్రీవిద్యా సాధనా కేంద్రాన్ని నిర్వహిస్తున్న శ్రీ చైతన్య గురూజీ అలియాస్‌ మేరెడ్డి సునీల్‌రెడ్డిపై ఈ కేసు నమోదైంది. ఆధ్యాత్మిక సాధనల పేరుతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ భార్యతో సాన్నిహిత్యం పెంచుకుని, ఆమెకు అసభ్యకర సందేశాలు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

నిలదీయడంతో బెదిరింపులు?

తన భార్యకు గురూజీ సందేశాలు పంపుతున్న విషయం తెలుసుకున్న ఆమె భర్త విష్ణుదీప్‌రెడ్డి సాధనా కేంద్రానికి వెళ్లి ఆయన్ను నిలదీసినట్లు సమాచారం. ఈ క్రమంలో తన జీవితాన్ని నాశనం చేస్తానని, మరోసారి అక్కడికి వస్తే చంపుతానని గురూజీ బెదిరించినట్లు బాధితుడు ఆరోపించారు.

కోర్టు అనుమతితో కేసు

చాటింగ్‌ ఆధారాలు, బెదిరింపులకు సంబంధించిన వివరాలతో బాధితుడు కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతితో జూబ్లీహిల్స్‌ పోలీసులు గురూజీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో ఆరోపణల వాస్తవాలను పోలీసులు విచారణ ద్వారా నిర్ధారించాల్సి ఉంది.