అసెంబ్లీ వద్ద పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఎఫ్‌ఐఆర్‌

బీఎన్ఎస్‌లోని పలు సెక్షన్ల కింద సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు
ఇప్పటికే కేటీఆర్‌, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్‌ఎస్‌ నేతలపై కేసులు

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి కేసుల నమోదు కొనసాగుతోంది. తాజాగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పీఆర్వో మహేష్‌, పీఏ మహేందర్‌రెడ్డిపై సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆర్‌ఐ జంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. మహేష్‌, మహేందర్‌రెడ్డిపై BNS సెక్షన్లు 132, 352, 351(2), రీడ్‌ విత్‌ 3(5) కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు సమాచారం.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య జరిగిన తోపులాట నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. ఇదే ఘటనకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనలో మరికొందరి పాత్రపై కూడా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.