Vadodara | కారులో భారీ పేలుడు…

Vadodara | కారులో భారీ పేలుడు…

ఎన్‌హెచ్‌-48పై ఒక్కసారిగా పేలిన కారు..
రెండు వాహనాలు ధ్వంసం.. తప్పిన ప్రాణనష్టం


Vadodara | వడోదర, అక్టోబర్‌ 3 (ఆంధ్రప్రభ): గుజరాత్‌లోని వడోదర జిల్లా కర్జన్‌ సమీపంలో జాతీయ రహదారి-48పై సీఎన్‌జీ నింపుతుండగా ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. అక్టోబర్‌ 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిందాల్‌ కంపెనీకి ఎదురుగా ఉన్న సీఎన్‌జీ బంకులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో బంకు వద్ద ఉన్నవారు ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

కారును సీఎన్‌జీ నింపే ప్రదేశంలో నిలిపిన అనంతరం డ్రైవర్‌ బయటకు వెళ్లాడు. సిబ్బంది ఇంధనం నింపుతున్న సమయంలోనే కారు గ్యాస్‌ ట్యాంక్‌ ఒక్కసారిగా పేలినట్లు సమాచారం. పేలుడు ధాటికి కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతింది. అద్దాలు పగిలి కొన్ని మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి.

పేలుడు తీవ్రతకు కారుకు సమీపంలో నిలిపి ఉంచిన మరో రెండు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. బంకులోని కొన్ని వస్తువులు ధ్వంసమయ్యాయి. భారీ శబ్దంతో అక్కడ కొద్దిసేపు భయానక వాతావరణం నెలకొంది. అయితే ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను విషాదం తప్పింది.

సమాచారం అందుకున్న వెంటనే కర్జన్‌ ఫైర్‌ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకుని పరిసరాలను పరిశీలించారు. తదుపరి ప్రమాదం జరగకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టారు. పేలుడుకు కచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. సీఎన్‌జీ ట్యాంక్‌లో సాంకేతిక లోపం లేదా ఇతర కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని నివేదికలు గ్యాస్‌ ట్యాంక్‌ పేలడమే ఘటనకు కారణమై ఉండొచ్చని పేర్కొన్నాయి.