Canva Layoffs |ఉద్యోగం పోయినా 6 నెలల జీతం.. ఆపై అదిరిపోయే కాంపెన్సేషన్ ప్యాకేజీ..!

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన ప్రముఖ డిజైన్ ప్లాట్‌ఫారమ్ ‘క్యాన్వా’ ఉద్యోగుల విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీ ప్రారంభమైన గత 13 ఏళ్ల చరిత్రలో ఇంత భారీ స్థాయిలో మార్పులు, ఉద్యోగుల తొలగింపు చేపట్టడం ఇదే మొదటిసారి.

భవిష్యత్ అవసరాలకనుగుణంగా కంపెనీని మరింత పటిష్టం చేసేలా చేపట్టిన ఈ భారీ ప్రక్షాళనలో ఏకంగా 1,271 మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. ఇది కంపెనీ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 22 శాతం కావడం విశేషం. ఈ కఠిన నిర్ణయాన్ని క్యాన్వా సీఈవో మెలానీ పెర్కిన్స్ నవంబర్ 4న స్వయంగా ఉద్యోగులకు తెలియజేశారు. ఈ మార్పుల వల్ల కొంతమంది ఉద్యోగాలు కోల్పోనుండగా, మరికొందరు వేరే ప్రాంతాలకు మారాల్సి వస్తుంది. మరికొందరికి కొత్త బాధ్యతలు అప్పగించనున్నారు.

ఉద్యోగాలు కోల్పోతున్న సిబ్బందిని అలాగే వదిలేయకుండా, క్యాన్వా ప్రకటించిన ఎగ్జిట్ పాలసీ ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఉద్యోగులకు అండగా నిలిచేందుకు కంపెనీ సంచలన ప్రయోజనాలను ప్రకటించింది:

ఆరు నెలల పూర్తి జీతం: ఉద్యోగి ఏ దేశంలో పనిచేస్తున్నారనే సంబంధం లేకుండా, జాబ్ కోల్పోయిన ప్రతి ఒక్కరికీ కనీసం ఆరు నెలల జీతం చెల్లిస్తారు.

సంవత్సరం పాటు హెల్త్ ఇన్సూరెన్స్: ప్రస్తుతం హెల్త్ కవరేజ్ ఉన్న దేశాల్లో ఈ సదుపాయం మరో 12 నెలల పాటు నిరంతరంగా కొనసాగుతుంది.

కుటుంబానికి సైకలాజికల్ సపోర్ట్: ‘క్యాన్వా కేర్‌’ ద్వారా ఉద్యోగితో పాటు వారి కుటుంబ సభ్యులకు ఏడాది పాటు మానసిక ఆరోగ్య సహాయం (మెంటల్‌ హెల్త్‌ సపోర్ట్‌) లభిస్తుంది.

యాపిల్ ల్యాప్‌టాప్ వారికే సొంతం: కంపెనీ పనికోసం ఇచ్చిన ఆపిల్‌ మాక్‌బుక్‌ను ఉద్యోగులు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, అది పూర్తిగా వారికే ఇవ్వనున్నారు.

షేర్ల వెయిటింగ్ రూల్ ఎత్తివేత: గత ఏడాదిలో కంపెనీలో చేరిన ఉద్యోగులకు షేర్లు రావడానికి ఉన్న ఒక సంవత్సరం వెయిటింగ్ నిబంధనను పూర్తిగా తొలగించారు.

కొత్త జాబ్ కోసం అదిరిపోయే సపోర్ట్ సిస్టమ్..

ఉద్యోగం కోల్పోయిన వారు మళ్లీ త్వరగా నిలదొక్కుకునేలా క్యాన్వా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఏడాది పాటు ‘లింక్‌డిన్‌ ప్రిమియం ‘ సదుపాయాన్ని ఉచితంగా ఇవ్వడంతో పాటు, ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కోవాలో ప్రత్యేక నిపుణులతో శిక్షణ ఇవ్వనుంది. అలాగే, ఆసక్తి ఉన్న ఉద్యోగుల వివరాలను ప్రత్యేకంగా ‘అల్యూమ్ని టాలెంట్ డైరెక్టరీ’లో చేర్చి.. వాటిని తమ ఇన్వెస్టర్లు, బిజినెస్ పార్ట్‌నర్‌లతో పంచుకోవడం ద్వారా వెంటనే అవకాశాలు వచ్చేలా చూస్తోంది.

సొంత వ్యాపారం పెట్టుకోవాలనుకుంటే రూ.8.9 లక్షలు గ్రాంట్..

జాబ్ పోయినా పర్వాలేదు, సొంతంగా ఏదైనా వ్యాపారం లేదా స్టార్టప్ ప్రారంభించాలనుకునే వారి కోసం క్యాన్వా ‘క్యాన్వా కలెక్టివ్ ఫండ్’ను ఏర్పాటు చేసింది. ఈ పథకం కింద కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఒక్కొక్కరికి 10,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.8.9 లక్షలు) గ్రాంట్‌గా ఇస్తారు. విశేషం ఏమిటంటే.. ఈ డబ్బు తీసుకున్నందుకు మీ కొత్త వ్యాపారంలో క్యాన్వా ఎలాంటి వాటాలు గానీ, యాజమాన్య హక్కులు గానీ కోరదు.

ఇప్పుడు కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం బాధాకరమైనదే అయినప్పటికీ, ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా క్యాన్వా ప్రకటించిన ఈ ప్యాకేజింగ్ మాత్రం కార్పొరేట్ లో ఒక రోల్ మోడల్‌గా నిలుస్తోందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.