ఇంటి ఆవరణలో గంజాయి సాగు..

  • పోలీసుల దాడిలో మూడు మొక్కలు స్వాధీనం..
  • నిందితుడిపై కేసు నమోదు

కోటపల్లి, ఆంధ్రప్రభ: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆదేశాల మేరకు, టాస్క్‌ఫోర్స్/నార్కోటిక్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు, చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ ల పర్యవేక్షణలో కోటపల్లి ఎస్‌ఐ శివనీతి రాజశేఖర్, టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ జె. లక్ష్మణరావు లు పోలీసు సిబ్బంది తో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు ఎదుళ్లబందం గ్రామానికి చెందిన దుర్గం మహేష్ (33), తండ్రి చంద్రయ్య ఇంటి ఆవరణలో తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఇంటి ఆవరణలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలకు, మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ సాగు చేస్తున్న మూడు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న మొక్కలను వ్యవసాయ శాఖ ఏఈఓ పరిశీలించి అవి గంజాయి మొక్కలేనని నిర్ధారించారు. వీటిలో రెండు మొక్కలు 12 అంగుళాలు, మరో మొక్క 14 అంగుళాల ఎత్తు ఉన్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మూడు మొక్కల విలువ సుమారు రూ.4,600 ఉంటుందని అంచనా వేశారు.

గంజాయి సాగు, విక్రయాలు, రవాణా, వినియోగానికి పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ ఐ రాజశేఖర్ సూచించారు.