శిరీష హత్యను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

నిందితుడిని కఠినంగా శిక్షించాలి..
కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పరిహారం ఇవ్వాలని డిమాండ్‌

మంగపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ తుక్కుగూడలో గిరిజన నర్సు ఊకే శిరీష దారుణ హత్యను నిరసిస్తూ ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటలో బుధవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్‌ చైర్మన్‌ బాడిశ నాగరమేష్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. రాజుపేటలోని ముసలమ్మవాగు వంతెన నుంచి రమణక్కపేట గ్రామం వరకు శాంతియుతంగా ర్యాలీ కొనసాగింది.

ఈ సందర్భంగా బాడిశ నాగరమేష్‌ మాట్లాడుతూ శిరీష హత్యకు కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతోపాటు తగిన పరిహారం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

ఊకే శిరీష కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రజలు, మహిళలు, యువత అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువత పాల్గొని శిరీష కుటుంబానికి న్యాయం చేయాలని నినదించారు.