చాగల్లు రైతులకు కెనాల్‌ నీరు..

  • రైతుల విజ్ఞప్తిపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తక్షణ స్పందన..
  • అక్టోబర్‌ 2న నీటిని విడుదల చేస్తామని హామీ

స్టేషన్‌ ఘన్‌పూర్‌, ఆంధ్రప్రభ: పంటలు ఎండిపోతున్నాయని చాగల్లు గ్రామ రైతులు చేసిన విజ్ఞప్తిపై స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తక్షణమే స్పందించారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు గ్రామానికి చెందిన రైతుల ప్రతినిధులు మంగళవారం మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్‌, విప్‌ సంపత్‌రాజ్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి కెనాల్‌ నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు.

రైతుల సమస్యను ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరంగా తెలుసుకున్నారు. పంటలకు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, అక్టోబర్‌ 2వ తేదీ ఉదయం కెనాల్‌ను తెరిచి నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో చాగల్లు రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతుల సమస్యపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యేకు కౌన్సిలర్‌ సంపత్‌రాజ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి ఐలపాక శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా ప్రతినిధి భాస్కుల సమ్మయ్య, వడ్లకొండ వెంకటయ్య, నీల లచ్చన్న, కోతి అజయ్‌, సురేష్‌, కనకం సుదర్శనం, బి. రవి, చి. వెంకటయ్య, యాదగిరి, ఐ.బి. వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.