Elections|ఎక్క‌డివార‌క్కడ గ‌ప్‌చుప్‌

ఎక్క‌డివార‌క్కడ గ‌ప్‌చుప్‌

  • నేటితో మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ ప్ర‌చారం బంద్
  • సాయంత్రం ఐదు గంటల కల్లా మూగబోనున్న మైకులు
  • విశ్రాంతి తీసుకోనున్న ప్రచార రథాలు
  • చివ‌రి రోజు అభ్య‌ర్థుల సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు
  • ప్ర‌చారం ముగిశాక ర‌హ‌స్య సంప్ర‌దింపులు

Elections|ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ర్టంలో మున్సిపల్ ఎన్నికల ఘ‌ట్టం తుది అంకానికి చేరుకుంది. గ‌త కొన్ని రోజులుగా హోరెత్తుతున్న ప్రచారానికి నేటితో తెరపడనుంది. పోలింగ్‌ ముగింపు సమాయానికి 48 గంటల ముందు ప్రచారం ముగించాలన్న నిబంధన మేరకు నేటి (సోమ‌వారం) సాయంత్రం 5 గంటలకు ప్రచారం బంద్‌ కానుంది. సోమవారం ప్రచారానికి చివరి రో జు కావడంతో అభ్య‌ర్థులు చివ‌రి గంట‌ల్లో జోరుగా చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గల్లీ గల్లీలో మైకుల మోత మోగిస్తున్నారు. బుధవారం (11వ తేదీ) పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

ఇక సైలెన్స్‌గా ప్ర‌చారం
కొన్నిగంట‌ల్లో ప్ర‌చారం ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో అభ్యర్థులు నిశ్శబ్దంగా ప్ర‌చారం చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. సైలెన్స్‌గా లోపాయకారీ ఒప్పందాలు.. కుల, మత సమీకరణలపై దృష్టి సారించారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు హామీల వర్షం కురిపిస్తూనే, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను చిత్తు చేసేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు.

మొద‌లైన ప్రలోభాల పర్వం
మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి తెరలేచింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దండాలు, ఉపన్యాసాలు, వాగ్దానాలను మాత్రమే నమ్ముకోకుండా వ్యక్తిగత ప్రయోజనాలు సమకూర్చే పనిలో పడిపోయారు. ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగియనుండటం, పోలింగ్‌కు సమయం సమీపిస్తుండటంతో వీలున్నన్ని మార్గాల్లో ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మద్యం, మాంసం, కూల్‌డ్రింక్స్, చీరలు, బిర్యానీలతో పాటు స్టీల్‌ సామాన్లు కూడా పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ పంపిణీ కార్యక్రమం నేటి నుంచి మరింత ఊపందుకుంటుందని, వీటన్నింటితోపాటు ఆయా మున్సిపాలిటీలు, వార్డులు,కార్పొరేషన్లు, డివిజన్ల వారీగా ఓటుకో రేటు నిర్ణయించిన రాజకీయ నాయకులు ఈ మేరకు అంతా సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.

ఓటుకు నోటు…
ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కొన్ని మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఎంత నగదు ఇవ్వాలో కూడా ఫిక్స్‌ చేశారు. వార్డులు, కార్పొరేటర్ల రిజర్వేషన్లు, మున్సిపాలిటీల స్థాయిని బట్టి రూ.1,000 నుంచి రూ.5,000 వరకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల రూ.10వేల వరకు ఓటుకు రేటు పలుకుతుందని, అయితే, ప్రచార పర్వం ముగిసిన తర్వాత ఈ నగదు పంపిణీపై అభ్యర్థులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది.

వ‌ల‌స ఓట‌ర్ల‌కు గాలం..
మున్సిపల్‌ ఎన్నికల్లో ఒక్కో ఓటు కీలకం కానుంది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు ఒక్కో ఓటు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ వార్డులోని ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారు.. ఎవరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని ఆరా తీస్తూ వారిని ప్రసన్నం చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు. ఉద్యోగాలు, ఉపాధి రీత్యా ఇతర పట్టణాలకు ప్రాంతాలకు వలస వెళ్లిన పట్టణ ఓటర్లను రప్పించేందుకు ఫోన్లు చేస్తున్నారు. ఓటేసి వెళ్లాల‌ని మెసేజ్‌లు చేస్తూ అభ్య‌ర్థిస్తున్నారు. వారు వ‌చ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముగ్గురు, నలుగురు, అంతకంటే ఎక్కువ మంది ఓటర్లు ఉంటే ప్రత్యేక వాహనాలు సమకుర్చేందుకు సిద్ధవుతున్నారు. ఒకరిద్దరు ఓటర్లు ఉన్నా వారు కోరితే వాహన సదుపాయం కల్పిస్తామని, లేదంటే రాకపోకలకు రవాణా ఖర్చులతో పాటు ఇతర ఖర్చులు ముందుగానే అందిస్తామని చెబుతున్నారు.

11న పోలింగ్‌.. 13న లెక్కింపు..
మొత్తం ఏడు కార్పొరేషన్లలోని 414 వార్డులకు, 32 జిల్లాల్లోని 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకు ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నెల 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్‌ జరుగనుంది. రీపోలింగ్‌ అవసరమైతే 12న నిర్వహిస్తారు. 13న ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. 16న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52,43,00 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52,43,00 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని వివరించారు. పోలింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు 16,031 బ్యాలెట్‌ బాక్సులను సిద్థం చేయడంతోపాటు 8,203 పోలింగ్‌ కేంద్రాలను నిర్ణయించారు. ఎన్నికల సామగ్రి భద్రత కోసం 137 స్ర్టాంగ్‌ రూమ్‌లను, ఓట్ల లెక్కింపునకు 136 కౌంటింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు.

వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ప‌ర్య‌వేక్ష‌ణ‌
100శాతం వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షిస్తామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటూ 30 జిల్లాల్లోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో 11,000 కంటే ఎక్కువ స్మార్ట్‌ కెమెరా యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. రెండు వారాలుగా హోరా హోరీగా జరిగిన పార్టీల ప్రచార పర్వంతో పురపాలికల ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారో ఈ నెల 13న కౌంటింగ్‌లో తేలిపోనుంది.

మ‌ద్యం దుకాణాలు బంద్‌
తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులపాటు మద్యం దుకాణాల బంద్‌కు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ దృష్ట్యా శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా ఎన్నికలు జరిగే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలోని వైన్స్, బార్లను రెండు రోజుల పాటు మూసివేయనున్నారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికల ప్రచారం గడువు ముగియనుండటంతో సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ రోజు అంటే ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలను ఆ ప్రాంతాల్లో పూర్తిగా నిషేధించారు.

Leave a Reply