దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) తమ అభ్యర్థిని ఖరారు చేసింది. ఉప రాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుండగా.. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సి.పి. రాధాకృష్ణన్‌ను భారతీయ జనతా పార్టీ (BJP) అధికారిక అభ్యర్థిగా ప్రకటించింది. ఇక, విపక్షాల ఐ.ఎన్.డి.ఐ.ఏ కూటమి కూడా తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
కాగా, తమిళనాడుకు చెందిన సి.పి. రాధాకృష్ణన్ గతంలో రెండు సార్లు కోయంబత్తూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీలో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉండటంతో పాటు, సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు.
ఫిబ్రవరి 2023 నుంచి జూలై 2024 వరకు జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేసిన రాధాకృష్ణన్, అనంతరం 2024 జూలై 27న మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. తెలంగాణలోనూ ఆయన ఇన్ చార్జ్ గవర్నర్‌గా పనిచేశారు.
దక్షిణాది రాష్ట్రాలపై పార్టీ పట్టు పెంచుకోవడం లక్ష్యంగా BJP ఈ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో పార్టీ స్థితిని బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం సహాయపడుతుందనే అంచనాలు ఉన్నాయి.