C. Joseph Vijay | తమిళనాడు సీఎం పనితీరుపై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన జోసెఫ్‌ విజయ్‌ పాలనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పదవిలోకి వచ్చిన తర్వాత ఆయన పని తీరుపై తాజాగా మంత్రి ఆధవ్‌ అర్జున చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విజయ్‌ రోజుకు 18 నుంచి 20 గంటల వరకు పనిచేస్తున్నారని, తెల్లవారుజామునే మంత్రులకు ఫోన్లు చేసి శాఖల పరిస్థితిని తెలుసుకుంటున్నారని ఆయన వెల్లడించారు. అంతేకాదు.. ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ఆస్వాదించడం కంటే పరిపాలనపైనే పూర్తి దృష్టి పెట్టారని పేర్కొన్నారు.

చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఆధవ్‌ అర్జున విజయ్‌ రోజువారి పనుల గురించి వివరించారు. సీఎం ఉదయం నాలుగు గంటలకే మంత్రులకు ఫోన్‌ చేసి, ఆయా శాఖల్లో జరుగుతున్న పరిణామాలను అడిగి తెలుసుకుంటారని చెప్పారు. రోజులో ఎక్కువ సమయాన్ని పాలనకు కేటాయిస్తున్న విజయ్‌.. అధికారులతోనూ తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
విజయ్‌ పనితీరును వివరిస్తూ ఆధవ్‌ అర్జున ఆయనను రాజకీయ సన్యాసిగా అభివర్ణించారు.

ఎన్నికల విజయాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం కంటే.. ప్రభుత్వ వ్యవస్థను గాడిలో పెట్టడంపైనే విజయ్‌ ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై విజయ్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టారని ఆధవ్‌ అర్జున తెలిపారు.

ప్రభుత్వం తొలి 100 రోజుల్లో ఆర్థిక వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు పరిపాలనలో పారదర్శకత పెంచేందుకు చర్యలు చేపట్టిందని ఆధవ్‌ అర్జున తెలిపారు. ప్రభుత్వ ప్రక్రియల్లో జవాబుదారీతనం పెంచడం, ప్రజలకు అందాల్సిన ప్రయోజనాలు మధ్యలో ఎక్కడా ఆగిపోకుండా చూడటం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. మొత్తంగా విజయ్‌ పని తీరు, ఆయన దినచర్యపై మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.