వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు.. అరెస్టులు అన్యాయం!

పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయ కక్ష సాధింపు తగదు
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రతీకార చర్యలా?
మా నాయకులను వెంటనే విడుదల చేయాలి: బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

నందికొట్కూరు, ఆంధ్రప్రభ : వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ పోలీసుల ద్వారా అరెస్టులు చేయించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వైసీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అధికార కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో బుధవారం వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు.

తమ పార్టీ నాయకులు ఎక్కడ ఉన్నారో వారి కుటుంబ సభ్యులకు, పార్టీ శ్రేణులకు స్పష్టంగా తెలియజేయకుండా పోలీసులు వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. ఇటీవల నందికొట్కూరు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీకి ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేకే అధికార పార్టీ నాయకులు ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవించాల్సింది పోయి వైసీపీ నాయకులను అరెస్టు చేస్తూ భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నామని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

గత ఐదేళ్ల వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో నందికొట్కూరు నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనించిందని, అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గుర్తుచేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా రాజకీయ కక్ష సాధింపులకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయ నిర్బంధాలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం చేస్తున్న ప్రతి పనికి భవిష్యత్తులో అసలుకు వడ్డీతో సహా సమాధానం చెప్పాల్సి వస్తుందని అధికార పార్టీ నాయకులు, కొందరు అధికారులను ఉద్దేశించి హెచ్చరించారు.

నందికొట్కూరు నియోజకవర్గంలో త్వరలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి వెళ్తామని ప్రకటించారు. పోలీసుల అదుపులో ఉన్న తమ పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ నాయకుల అరెస్టులకు సంబంధించిన ఆధారాలతో సహా ప్రజల ముందుకు వస్తామని హెచ్చరించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని, ఎవరికి భయపడే ప్రసక్తే లేదని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్పష్టం చేశారు.