BWF World Championships 2026 | గట్టెక్కిన లక్ష్య సేన్..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్య సేన్‌ శుభారంభం చేశాడు. అయితే తొలి రౌండ్‌లో అతడికి అనుకున్నంత సులువైన విజయం దక్కలేదు. ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్‌ వాలెంటైన్‌ ఫిలిమోన్‌ చేతిలో తొలి గేమ్‌ కోల్పోయిన లక్ష్య.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని వరుసగా రెండు గేమ్‌లు గెలిచి ప్రీక్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో 14వ సీడ్‌ లక్ష్య సేన్‌.. ప్రపంచ 128వ ర్యాంకర్‌ ఫిలిమోన్‌ను 16-21, 21-8, 21-4తో ఓడించాడు.

ఆరంభంలో తడబాటు..

సొంతగడ్డపై ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఆడుతున్న ఒత్తిడి లక్ష్యపై తొలి గేమ్‌లో స్పష్టంగా కనిపించింది. ఫిలిమోన్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ స్మాష్‌లు, క్రాస్‌కోర్ట్‌ షాట్లతో భారత ఆటగాడిపై ఒత్తిడి పెంచాడు. లక్ష్య సేన్ షాట్లు సరిగ్గా ఆడలేక, అనవసరమైన తప్పులు చేయడంతో మొదటి గేమ్‌ను 16-21 తేడాతో కోల్పోయాడు. మ్యాచ్‌కు ముందు వేసుకున్న వ్యూహం పనిచేయలేదని, పరిస్థితులకు అనుగుణంగా మారాల్సి వచ్చిందని లక్ష్య కూడా తర్వాత పేర్కొన్నాడు.

పుంజుకున్న భారత స్టార్‌

తొలి గేమ్‌ ఓటమి తర్వాత లక్ష్య తన ఆటతీరును పూర్తిగా మార్చుకున్నాడు. కోచ్‌ సూచనలతో వేగం పెంచిన అతడు.. ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. రెండో గేమ్‌లో ఆరంభం నుంచే నియంత్రణ సాధించి 21-8తో సొంతం చేసుకున్నాడు. మూడో గేమ్‌లో అయితే లక్ష్యకు ఎదురేలేకపోయింది. ఫిలిమోన్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత షట్లర్‌ 21-4తో గేమ్‌ను ముగించి విజయం ఖాయం చేసుకున్నాడు. ప్రీక్వార్టర్‌ ఫైనల్‌లో లక్ష్య సేన్‌ అమెరికా యువ ఆటగాడు గారెట్‌ టాన్‌తో తలపడనున్నాడు.

ట్రీసా–గాయత్రికి ముందంజ

మహిళల డబుల్స్‌లో భారత జోడీ ట్రీసా జాలీ–గాయత్రి గోపీచంద్‌ కూడా ప్రీక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. అమెరికాకు చెందిన 16వ సీడ్‌ లారెన్‌ లామ్‌–అలిసన్‌ లీ జోడీపై 21-15, 21-12తో విజయం సాధించింది. అర్జున అవార్డు అందుకున్న తర్వాత తొలి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనే ట్రీసా–గాయత్రి జోడీ ఆకట్టుకుంది. క్వార్టర్‌ ఫైనల్‌ బెర్తు కోసం జపాన్‌కు చెందిన ఏడో సీడ్‌ రిన్‌ ఇవానగి–కీ నకనిషి జోడీతో తలపడనుంది.

మిశ్రమ ఫలితాలు

భారత శిబిరానికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. యువ షట్లర్‌ ఉన్నతి హుడా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ అరంగేట్రంలో విజయం సాధించింది. మయన్మార్‌కు చెందిన థెట్‌ హ్తార్‌ థుజార్‌పై 22-20, 21-16తో గెలిచి ముందంజ వేసింది. అయితే మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత జోడీలకు నిరాశ ఎదురైంది. రోహన్‌ కపూర్‌–రుత్వికా గద్దె జోడీ, ఆశిత్‌ సూర్య–అమృత ప్రముతేష్‌ జోడీలు ఓటమి పాలయ్యాయి. ధ్రువ్‌ కపిల–తనిషా క్రాస్టో జోడీ తమ పోరును ఇంకా ప్రారంభించాల్సి ఉంది.

మొత్తంగా సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు పోరాట పటిమ చూపిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో తడబడినా లక్ష్య సేన్‌ తిరిగి పుంజుకున్న తీరు అభిమానులకు ఆశలు పెంచుతోంది.