ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ కరోనా టైమ్‌లో ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ యాపిల్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. కరోనాతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చారు. ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు కొవిడ్-19 ఎమర్జెన్సీగా దానిని మార్క్ చేయవచ్చు. ఇలా మార్క్ చేసిన ఫుడ్ డెలివరీని జొమాటో స్పీడప్ చేస్తుంది. రైడర్ కు సమాచారం ఇచ్చి, నిర్ణీత గడువుకన్నా వేగంగా పార్శిల్ అందేలా చర్యలు తీసుకుంటుంది.
ఈ ఎమర్జెన్సీ ఆర్డర్లన్నీ కాంటాక్ట్‌లెస్‌వే. అంటే ముందుగానే పేమెంట్ చేసేయాలి. డెలివరీని మీ ఇంటి గుమ్మం ముందు ఉంచి వెళ్తారు. ఈ ఎమర్జెన్సీ ఆర్డర్‌లకు ఓకే చెప్పిన రెస్టారెంట్‌ల లిస్ట్‌ను యాప్‌లో అప్‌డేట్ చేశారు. ఆర్డర్ పేజీలో దిస్ ఆర్డర్ ఈజ్ రిలేటెడ్ టు ఎ కొవిడ్-19 ఎమర్జెన్సీ ఆప్షన్‌ను యూజర్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. వీటికి అదనపు ఛార్జీలను కూడా ఏమీ వసూలు చేయడం లేదని జోమాటో ప్రకటించింది. అయితే వీటిని దుర్వినియోగం మాత్రం చేయొద్దని జొమాటో కస్టమర్లను రిక్వెస్ట్ చేసింది. ఆర్డర్ త్వరగా వస్తుంది కదా అని అవసరం లేని వాళ్లు కూడా కోవిడ్ ఎమర్జెన్సీ ఆర్డర్ చేస్తే నిజంగా అవసరం ఉన్న వాళ్లకు అన్యాయం జరుగుతుందని పేర్కొంది. దీన్ని ఓ అంబులెన్స్ సర్వీసులాగా పరిగణించాలని కోరింది.