భారత వినియోగదారుల మార్కెట్‌లో గత ఐదుఆరు సంవత్సరాలుగా యవ కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కస్టమర్ల సగటు వయసు 7 సంవత్సరాలు తగ్గింది. ప్రధానంగా ప్రీమియం ఉత్పత్తులైన కార్లు, ప్రీమియం స్మార్టు ఫోన్లు, పెద్ద టీవీ సెట్స్‌ను యువ కస్టమర్లు అధికంగా కొనుగోలు చేస్తున్నారు. మారుతీ సుజుకీ, హ్యుండాయ్ మోటార్స్, మెర్సిడెస్ బెంజ్ కంపెనీల ప్రకారం 2018-19లో సగటు వినియోగదారుల వయస్సు 40 సంవత్సరాల నుంచి 2023-24 నాటికి సగటు వయసు 30 సంవత్సరాలకు తగ్గింది.
ప్రస్తుతం విక్రయాలు జరుగుతున్న విద్యుత్ కార్లలో 70 వాహనాలను 20-30 సంవత్సరాల వయసు ఉన్న వార కొనుగోలు చేశారు. ఇదే కాలంలో యాపిల్ ఐ ఫోన్లను కొనుగోలు చేస్తున్న వారి సగటు వయసు 33-34 సంవత్సరాల నుంచి 28-29 సంవత్సరాలకు తగ్గింది. 55 ఇంచ్‌ల కంటే ఎక్కువగా ఉన్న స్మార్ట్ టీవీలను కొనుగోలు చేస్తున్న వారి సగటు వయసు 35-36 సంవత్సరాల నుంచి 29-30 సంవత్సరాలకు తగ్గింది.
కార్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయని, వాటిని కొనుగోలు చేస్తున్న వారి వయసు మాత్రం గత ఐదు సంవత్సరాల్లో సగటున 38 సంవత్సరాలకు తగ్గిపోయిందని హ్యుండాయ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ చెప్పారు. యువ వినియోగదారులు ఆధునిక ఫీచర్లు కోరుకుంటున్నారని, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, సెఫ్టీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇందుకు ఎక్కువ చెల్లించడానికి వారు సిద్ధంగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
యువకులు పెద్ద సంఖ్యలో వర్క్‌ఫోర్స్‌లో జాయిన్ అవుతున్నందున రానున్న రోజుల్లో కొనుగోలుదారుల సగటు వయసు మరింతగా తగ్గే అవకాశం ఉందని మారుతీ సుజుకీ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్ధో బెనర్జీ చెప్పారు. ప్రీమియం ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు యువత ఆసక్తి చూపిస్తున్నారు. ఈ దిశగా వివిధ కంపెనీలు కూడా యువత అభిరుచులకు అనుగుణంగా ఆయా ఉత్పత్తులను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
యువత ప్రస్తుతం 10 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లు, 30 వేల నుంచి లక్షకు పైగా రేటు ఉన్న స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. తమ కంపెనీ కార్లను కొనుగోలు చేస్తున్న వారి వయసు ఐదు సంవత్సరాల క్రితం సగటున 45 సంవత్సరాలుగా ఉంటే, ప్రస్తుతం అది 38 సంవత్సరాలుగా ఉందని మెర్సిడెస్ బెంజ్ కార్ల కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ అయ్యర్ తెలిపారు. ఆడీ కార్ల అమ్మకాల్లో 40 శాతం వాహనాలను 40 సంవత్సరాల లోపు వయసున్న వారే కొనుగోలు చేస్తున్నారని ఆడీ తెలిపింది.