చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షావోమీ గురువారం నాడు తొలి విద్యుత్ కారును ఆవిష్కరించింది. బీజింగ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కంపెనీ సీఈఓ లీ జున్ ఈ కొత్త కారును పరిచయం చేశారు. ఎస్‌యూ 7 పేరుతో ఈ కారును మార్కెట్‌లోకి కంపెనీ తీసుకురానుంది. ఈ సెడాన్ కారులో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రముఖ ఫోన్లతో అనుసంధానం అయ్యేలా రూపొందించారు. చైనా దిగ్జక కంపె నీలుగా పేరున్న కాన్‌టెంపరరీ యాంపరెక్స్ టెక్నాలజీ, బీవైడీ నుంచి తీసుకున్న బ్యాటరీలను ఈ కార్లలో వినియోగిస్తున్నారు.
వచ్చే 15-20 సంవత్సరాల్లో ప్రపంచంలో తొలి ఐదు టాప్ కార్ల తయారీ కంపెనీల్లో ఒకటిగా ఉంటామని లీ జున్ ధీమా వ్యక్తం చేశారు. షావోమీ ఎస్‌యూ 7 కారును సెల్-టు-బాడీ టెక్నాలజీతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఇందులో బ్యాటరీని నేరుగా వాహన నిర్మాణానికే అనుసంధానం చేసినట్లు చెప్పారు. దీని వల్ల కారు ధృఢత్వం పెరిగిందన్నారు. ఇప్పటికే కంపెనీ రూపొందించిన అనేక యాప్‌లకు ఈ కారులో యాక్సెస్ ఉంటుందని చెప్పారు.
ఈ కారు ఎస్‌యూ 7, ఎస్‌యూ ప్రో, ఎస్‌యూ 7 మ్యాక్స్ పేరుతో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఎస్‌యూ 7 కారు 0-100 కి.మీ వేగాన్ని 5.28 సెకన్లలో అందుకుంటుంది. ఈ కారును ఒక సారి ఛార్జింగ్ చేస్తే 668 కి.మీ. రేంజ్ ఇస్తుంది. కారు గరిష్ట వేగం గంటకు 210 కి.మీ. అత్యధికంగా 400 ఎన్‌ఎం టార్క్ వద్ద 299 పీఎస్ శక్తిని విడుదల చేస్తుంది. ఎస్‌యూ7 మ్యాక్స్ వేరియంట్ 2.78 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.
ఈ కారు ఒక సారి ఛార్జింగ్ చేస్తే 800 కి.మీ. రేంజ్ ఇస్తుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 265 కి.మీ. 838 ఎన్‌ఎం టార్క్ వద్ద 673 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 101 కివాట్ అవర్ సామర్ధ్యం ఉన్న సెల్ టూ బాడీ బ్యాటరీని అమర్చారు. కంపెనీ త్వరలోనే ఎస్‌యూవీ7 వీ8 పేరుతో 150 కి.వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో తీసుకురానున్నట్లు తెలిపింది.
ఈ కార్ల ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. వీటి ధరలు కొంచెం ఎక్కువగానే ఉంటాయని సీఈఓ లీ జున్ తెలిపారు. కారును చూసిన తరువాత కస్టమర్లు ఆ ధరకు సంతృప్తి చెందుతారని చెప్పారు. తక్కువ ఉష్టోగ్రతల్లోనూ వేగంగా ఛార్జ్ అయ్యేలా కారును అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కంపెనీ ఈ కార్లను ఎంఐ బ్రాండ్ పేరుతో తయారు చేస్తోంది. ఇండస్ట్రీలో తమదే మెరుగైన అటానమస్ డ్రైవింగ్ వ్యవస్థ ఉన్న కారని ఆయన చెప్పారు. ఈ కార్లు అక్వా బ్లూ, మినరల్ గ్రే, వెర్డంట్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. వచ్చే 10 సంవత్సరాల్లో కార్ల తయారీపై 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని షావోమీ ప్రకటించింది.