Tuesday, November 19, 2024

Twitter | ఎక్స్‌ విలువ 19 బిలయన్‌ డాలర్లు.. ఎలాన్‌ మస్క్‌ చెల్లించిన దానిలో ఇది సగమే

సామాజిక మాధ్యం ఎక్స్‌ (ట్విటర్‌) ఉద్యోగులకు స్టాక్‌ గ్రాంట్స్‌ను జారీ చేసింది. దీని ప్రకారం ఎక్స్‌ విలువ 19 బిలియన్‌ డాలర్లు మాత్రమే. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ గత సంవత్సరం ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం దాని విలువ సగానికంటే తక్కువకు పడిపోయింది. ట్విటర్‌ కొనుగోలు కోసం ఎలాన్‌ మస్క్‌ ఒక్కో షేరుకు 54.20 డాలర్ల ప్రకారం చెల్లించారు.

ట్విటర్‌ వాస్తవ విలువ కంటే అధికంగా చెల్లించానని మస్క్‌ మొదటి నుంచి చెబుతు వస్తున్నారు. మార్చిలోనే ఎక్స్‌ ఉద్యోగులకు ఆయన ఒక లేఖ రాస్తూ ప్రస్తుత కంపెనీ విలువ 20 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు తాజాగా ఆ విషయాన్ని ఆయన అధికారికంగా ధృవీకరించారు. స్టాక్‌ గ్రాంట్స్‌ విలువను కంపెనీ బోర్డు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయిస్తుంది.

- Advertisement -

ఈ లెక్కన ఒక్కో షేరు విలువను 45 డాలర్లుగా లెక్కగట్టి ఉద్యోగలకు గ్రాంట్స్‌ జారీ చేసింది. అంటే కంపెనీ విలువ 19 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉందని స్వయంగా అంగీకరించినట్లయ్యింది. రెస్ట్రిక్టెడ్‌ స్టాక్‌ యూనిట్స్‌ (ఆర్‌ఎస్‌యూ) కింద ఒక్కో షేరును 45 డాలర్ల విలువతో జారీ చేస్తున్నామని ఎక్స్‌ తమ ఉద్యోగులకు తెలిపింది.

రానున్న రోజుల్లో వీటిని విక్రయించి సొమ్ము చేసుకునే వెసులుబాటు ఉద్యోగులకు ఉంటుంది. పాత యాజమాన్యం ఆధ్వర్యంలో పొందిన షేర్లకు మాత్రం కొనుగోలు సమయంలో నిర్ణయించినట్లుగా ఒక్కో స్టాక్‌పై 54.20 డాలర్లు చెల్లిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. కంపెనీ విలువ సగానికి పడిపోయినప్పటికీ, షేరు విలువ కూడా ఆ స్థాయి తగ్గుదల ఎందుకు నమోదు కాలేదన్న విషయంలో స్పష్టత లేదు.

ట్విటర్‌ను కొనుగోలు చేసిన తరువాత ఎలాన్‌ మస్క్‌ అనేక మార్పులు చేశారు. 80 శాతం మంది ఉద్యోగులను తొలగించారు. వెరిఫికేషన్‌ ప్రక్రియలో మార్పులు చేశారు. కంటెంట్‌ మాడరేషన్‌లోనూ మార్పులు చేశారు. ట్విటర్‌ పేరును ఎక్స్‌గా మార్చారు. మస్క్‌ చేతికి వచ్చిన తరువాత ఎక్స్‌ ప్రకటనల ఆదాయం 60 శాతం తగ్గిందని ఎలాన్‌ మస్క్‌నే స్వయంగా ప్రకటించారు.

రానున్న రోజుల్లో ఎక్స్‌ను పూర్తి స్థాయిలో ఎవ్రీథింగ్‌ యాప్‌గా మార్చనున్నట్లు ఆయన ఇటీవలే వెల్లడించారు. ఎక్స్‌లో చెల్లింపుల విధానాన్ని తీసుకు వచ్చారు. ఆడియో, వీడియో కాల్స్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. రానున్న రోజుల్లో ఒక వ్యవక్తి ఆర్ధిక జీవితానికి ఎక్స్‌ను అడ్డగా మారుస్తామని మస్క్‌ ప్రకటించారు. రానున్న రోజుల్లో ఎక్స్‌లో అనేక మార్పులు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement