Saturday, November 23, 2024

విప్రోకు 10 బిలియన్‌ డాలర్ల ఆదాయం..

ఐటీ దిగ్గజం విప్రో 2021-22 ఏడాదిలో తాము తొలిసారిగా 10.4 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు విప్రో సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ థియర్రీ డెలాపోర్టే వెల్లడించారు. ఆదాయంలో 27శాతం వృద్ధి సాధించిందని తెలిపారు. ఈ మార్చితో ముగిసిన త్రైమాసికంలో విప్రో నికరలాభం గతేడాది ఇదేకాలంకంటే 4 శాతం వృద్ధి చెంది రూ.3,047.3 కోట్లకు చేరింది. ఆదాయం 0.3 శాతం స్వల్పవృద్ధితో రూ.20,860.7 కోట్లకు పెరిగింది. త్రైమాసిక ఫలితాలు దాదాపు విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు ఎన్‌ఎస్‌ఈలో రూ. 508 వద్ద ముగిసింది. ఈ ఏప్రిల్‌ – జూన్‌ త్రైమాసికంలో 2.742.80 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని కంపెనీ గైడెన్స్‌ ఇచ్చింది. ఇది 2022 మార్చి క్వార్టర్‌తో పోలిస్తే 13శాతం అధికం. సమీక్షా త్రైమాసికంలో డాలర్ల ప్రాతిపదికన ఆదాయం డిసెంబర్‌ క్వార్టర్‌కంటే 3.1 శాతం వృద్ధితో 2.7 బిలియన్‌ డాలర్లకు పెరిగినట్టు విప్రో తెలిపింది. అన్ని మార్కెట్లలోనూ, రంగాల్లోనూ, వ్యాపార విభాగాల్లోనూ ముగిసిన ఏడాది రెండంకెల వృద్ధి సాధిచామని కంపెనీ సీఈవో వివరించారు.

కాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 45,416 మంది ఫ్రెషర్లను రిక్రూట్‌ చేసుకున్నట్టు విప్రో ప్రకటించింది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.43 లక్షలకు చేరింది. ముగిసిన మార్చి త్రైమాసికంలో కంపెనీ వలసల రేటు 23.8 శాతానికి పెరిగింది. డిసెంబర్‌ క్వార్టర్లో ఇది 22.7 శాతం ఉంది. అలాగే ఉద్యోగుల్ని సంస్థలో అట్టిపెట్టుకునేందుకు వ్యయాలు అధికంకావడంతో ఆపరేటింగ్‌ లాభం 1.2 శాతం తగ్గినట్టు విప్రో తెలిపింది. ఆపరేటింగ్‌ మార్జిన్లు కూడా 17.6 శాతం నుంచి 17 శాతానికి తగ్గాయి. ఉద్యోగుల్లో అధికంగా ప్రెషర్స్‌ ఉన్నందున, సిబ్బంది నికర వినియోగం రేటు 85.8 శాతం నుంచి 85.2 శాతానికి తగ్గింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement