Home బిజినెస్ Price Hike | కొత్త సంవత్సరంలో కార్ల ధరలకు రెక్కలు

Price Hike | కొత్త సంవత్సరంలో కార్ల ధరలకు రెక్కలు

0
Price Hike | కొత్త సంవత్సరంలో కార్ల ధరలకు రెక్కలు

కార్ల తయారీ కంపెనీలు నూతన సంవత్సరం నుంచి తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. మారుతీ సుజుకీ, హ్యుండాయ్‌, ఎంజీ ఇండియా మోటార్స్‌, ఆడి, బీఎండబ్ల్యూ, టాటా మోటార్స్‌, కియా ఇలా అన్ని ప్రముఖ కంపెనీలు జనవరి 1 నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.

తయారీ వ్యయాలు పెరగడం మూలంగానే ధరలు పెంచుతున్నట్లు అన్ని కంపెనీలు ప్రకటించాయి. ప్రయాణికుల వాహనాల ధరలను 3 శాతం పెంచుతున్నట్లు టాటా మోటార్స్‌ తెలిపింది. విద్యుత్‌ వాహనాల ధరలు కూడా పెంచుతున్నట్లు టాటా మోటార్స్‌ తెలిపింది.

కియా మోటార్స్‌ కూడా జనవరి 1 నుంచి కార్ల ధరలను 2 శాతం పెంచుతున్నట్లు తెలిపింది. ముడి సరుకుల ధరలు పెరడం, సప్లయ్‌ చైన్‌ వ్యయాలు కూడా పెరగడంతో కార్ల ధరలు పెంచక తప్పడంలేదని కియా మోటార్స్‌ తెలిపింది. కొత్త సంవత్సరం నుంచి ధరలు పెంచడం కంపెనీల వ్యూహంలో భాగమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

సాధారణంగా కొనుగోలుదారులు జనవరిలో కొత్త వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపుతారు. పాత సంవత్సరంలో మిగిలిన స్టాక్‌ను త్వరగా విక్రయించుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. జనవరి నుంచి ధరలు పెరుగుతున్నందున, డిసెంబర్‌లోనే కొనుగోలు చేయడం మంచిదని చాలా మంది కస్టమర్లు భావిస్తారని వీరు అభిప్రాయపడుతున్నారు.

ఈ దృష్టితోనే కంపెనీలు ధరల పెరుగుదలను ప్రకటించాయని తెలిపారు. అన్ని కంపెనీలు ఫెస్టివల్‌ సీజన్‌లో కార్లపై భారీగా డిస్కౌంట్లు అమలు చేశాయి. పేరుకుపోయిన పాత స్టాక్‌ను కొంత మేరకు విక్రయించగలిగాయి. తాజా ప్రకటనతో డిసెంబర్‌లో కార్ల అమ్మకాలు పెంచుకోవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి.

కొత్త సంవత్సరం నుంచి మారుతీ సుజుకీ కార్ల ధరలు 4 శాతం పెరగనున్నాయి. హ్యుండాయ్‌ కార్ల ధరలు 25,000 పెరుగుతాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా కార్ల ధరలు 3 శాతం, ఎంజీ మోటార్స్‌ ధరలు 3 శాతం పెరుగుతాయి. మెర్సిడెజ్‌ బెంజ్‌, ఆడీ కార్ల ధరలు 3 శాతం పెరుగుతాయి.

Exit mobile version