Tuesday, November 26, 2024

మరోసారి విండ్‌ఫాల్‌ టాక్స్‌ షాక్‌.. డీజిల్‌ ఎగుమతిపై లీటరుకు రూ.13.5 పెంపు

డీజిల్‌, జెట్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భారం మోపింది. వీటి ఎగుమతులపై విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం అర్థరాత్రి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. డీజిల్‌ ఎగుమతిపై విండ్‌ ఫాల్‌ టాక్స్‌ను లీటరుకు రూ.7 నుంచి రూ.13.5కు పెంచింది. అలాగే ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) ఎగుమతులపై పన్నును లీటరుకు రూ.2 నుంచి రూ.9 కి పెంచింది.

దీంతోపాటు దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై పన్ను టన్నుకు రూ.13,000 నుంచి రూ.13,300కి పెరిగింది. మార్జిన్ల పెరుగుదలకు అనుగుణంగా ఎగుమతులపై పన్నును పెంచారు. అంతర్జాతీయ చమురు బెంచ్‌మార్క్‌లలో మార్పులు, ఒపెక్‌, దాని మిత్రదేశాల అంచనా ఉత్పత్తి తగ్గింపునకు అనుగుణంగా దేశీయంగా ఉత్పత్తయ్యే చమురుపై కూడా లెవీని పెంచింది. దేశంలో మొదటిసారిగా జూలై 1న విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌లను విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement