ఎలక్ట్రికల్ వాహనాల రేట్లు వచ్చే మూడు, నాలుగు సంవత్సరాల పాటు తగ్గే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈవీల అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ, వృద్ధిరేటు మందగించే సూచనలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో వేసిన అమ్మకాల వృద్ధిరేటు కంటే తగ్గనున్నట్లు వారు చెబుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో ఉపయోగించే నికెల్, లిథియం, కోబాల్ట్ వంటి వాటి ధరలు పెరుగుతున్నాయి. దీని వల్ల ఊమించిన విధంఆ బ్యాటరీల ధరలు తగ్గే సూచనలులేవు.
ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు సంవత్సర సంవత్సరానికి పెరుగుతూ వస్తున్నాయి. సరాసరిన ఏడాదికి ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో 200శాతం పెరుగుదల నమోదైంది. ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో 149 శాతం వృద్ధినమోదైంది. లిథియం ఆయాన్ బ్యాటరీ కిలోవాట్ సామర్ధ్యానికి అయ్యే ఖర్చు తగ్గుతూ వస్తోంది. 2021లో ఇది 132 డాలర్లు ఉంటే, 2022 నాటికి ఇది సగటున 135 డాలర్లు ఉంటుందని అంచనా వేశారు. లిథియం అయాన్ బ్యాటరీల తయారీ వ్యయం వచ్చే మూడు నాలుగేళ్ల పాటు ప్రస్తుత స్థాయి నుంచి తగ్గే సూచనలు లేవని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని ప్రభావం వాహనాల విక్రయాలపై ఉంటుందని భావిస్తున్నారు.
క్యాథోడ్‌ల తయారీకి లిథియం, కోబాల్ట్, నికెల్ ప్రధాన మూలకాలు, మొత్తం బ్యాటరీ తయారీ వ్యయంలో క్యాథోడ్‌ల తయారీ వాటా 50 శాతానికిపైగా ఉంటుంది. గత ఐదు సంవత్సరాలుగా ఈ లోహాలకు డిమాండ్ బాగా పెరిగింది. సరఫరాలకు, డిమాండ్‌కు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడానికి వీటి ఉత్పత్తి పెంచాల్సి ఉంది. ప్రపంచంలో లిథియంను ఆస్ట్రేలియా, చిలీ, చైనా, అత్యధికంగా సరఫరా చేస్తున్నాయి. కాంగో, రష్యా, ఆస్ట్రేలియా అత్యధికంగా కోబాల్ట్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. నికెల్‌ను ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, రష్యా దేశాలు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల వీటి సరఫరాల్లో ఇబ్బందులు వస్తున్నాయి. పర్యావరణ సమస్యలతో చిలీలో లిథియం, కాంగోలో కోబాల్ట్ తవ్వకాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీని వల్ల వీటి ఉత్పత్తిని పెంచేందుకు ఇప్పటికి ఇప్పుడు సాధ్యం కాదు.
లిథియం అయాన్ బ్యాటరీల ధరలు తగ్గకపోవడం వల్ల వాహనాల రేట్లలోనూ మార్పు రాదు. వీటి ధరలు తగ్గితే అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈవీల అమ్మకాల్లో ద్విచక్రవాహనాల అమ్మకాలే 90 శాతం ఉన్నాయి. సాధారణ వాహనాలతో పోల్చితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాటరీల ధరలు తగ్గితేనే వీటి ధరల్లోనూ మార్పు వస్తుంది. దీని ప్రభావం అమ్మకాలపనై పడుతుంది. వీటి ధరలు తగ్గడం, నాణ్యమైన బ్యాటరీలు, ఛార్జింగ్ స్టేషన్లు పెరిగితేనే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు అంచనాకు అనుగుణంగా పెరిగే అవకాశం ఉంది.