Sunday, November 17, 2024

రికార్డ్‌ స్థాయికి టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ మే నెలలో రికార్డ్‌ స్థాయి 25.88 శాతానికి చేరింది. ఆహార పదార్ధాలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ సూచీ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో 15.08 శాతంగా ఉంది. గత సంవత్సరం మే నెలలో ఈ సూచీ 13.11 శాతం ఉంది. సంవత్సరం తిరిగే సరికి ధరలు ఏ స్థాయిలో పెరిగాయో ఇది సూచిస్తోంది. రసాయనాలు, రసాయన ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తుల ధరలు, వంట నూనెల ధరలు భారీగా పెరగడం వల్లే టోకు ధరల ద్రవ్యోల్బణం ఈ స్థాయికి చేరడానికి కారణం. వరసగా 14 నెలలుగా టోకు ధరల ద్రవ్యోల్బణం రెండు అంకెల్లో నమోదవుతూ వస్తోంది. మే నెలలో ఆహార పదార్ధాల ధరలు 12.34 శాతం పెరిగాయి. కూరగాయలు, గోధుమలు, పండ్లు, బంగాళాదుంపలు, టామాటాల ధరలు భారీగా పెరిగాయి. కూరగాయల ధరలు 56.36 శాతం, గోధుమల ధర 10.55 శాతం, గుడ్లు, మాంసం, చేపల ధరలు 7.78 శాతం పెరిగాయి. ఇంధన, విద్యుత్‌ రంగ ద్రవ్యోల్బణం 40.62 శాతానికి పెరిగింది. తయారీ వస్తువుల ధరలు 10.11 శాతం, ఆయిల్‌ సీడ్స్‌ ధరలు 7.08 శాతం పెరిగాయి. మే నెలలో ముడి పెట్రోలియం , సహజవాయువు రంగంలోని ద్రవ్యోల్బణం 79.50 శాతం పెరిగింది.

మే నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.04 శాతంగా నమోదైంది. ఇలా పెరగడం వరసగా ఐదో నెల. ఆర్బీఐ నిర్దేశించిన ల క్ష్యం కంటే ఇది చాలా ఎక్కువ. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్బీఐ వరసగా వడ్డీ రేట్లు పెంచుతోంది. ఈ సంవత్సరం ద్రవ్యోల్బణ అంచనాలను ఆర్బీఐ 100 బేసిస్‌ పాయింట్లు పెంచి, 6.7 శాతానికి సవరించింది. ద్రవ్యోల్బణం ఇలా పెరుగుతుంటే ఆర్బీఐ మరోసారి డిసెంబర్‌లో వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ సారి 100 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement