Monday, November 25, 2024

24 ఏళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం.. పెరిగిన ఇంధన, ఆహార ద్రవ్యోల్బణం..

న్యూఢిల్లి : దేశంలో ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరుగుతున్నది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నిరుపేదల జీవన విధానాన్ని మారుస్తున్నది. వీరి జీవితాలపై ద్రవ్యోల్బణం తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. ఆహారం, ఇంధనం, విద్యుత్‌ ధరల పెరుగుదల కారణంగా టోకు ద్రవ్యోల్బణం వరుసగా 13వ నెలలో రెండు అంకెల స్థాయిలోనే కొనసాగుతున్నది టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 15.08 శాతానికి చేరుకుంది. టోకు ద్రవ్యోల్బణం డిసెంబర్‌ 1998 తరువాత మొదటి సారిగా 15 శాతం దాటింది. డిసెంబర్‌ 1998లో ఇది 15.32 శాతంగా ఉంది. మార్చి 2022లో 14.55 శాతంగా ఉంది. ఫిబ్రవరిలో 13.11 శాతంగా ఉంది. ఏప్రిల్‌ 2021 నుంచి టోకు ద్రవ్యోల్బణం రెండు అంకెల స్థాయిలోనే ఉంది. పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరల కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్నదని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్‌ నెలలో ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం రేటు 8.35 శాతం కాగా.. మార్చి 8.06 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో ముడి పెట్రోలియం, సహజ వాయువు ద్రవ్యోల్బణం 69.07 శాతంగా ఉంది. అదే సమయంలో ఇంధనం, శక్తి ద్రవ్యోల్బణం 38.66 శాతానికి పెరిగింది. ఇది మార్చి 2022లో 34.52 శాతంగా ఉంది. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మార్చి 2022లో 10.71 శాతం నుంచి ఏప్రిల్‌ 10.85 శాతానికి పెరిగింది.

భగ్గుమంటున్న పండ్లు, గోధుమల ధరలు

కూరగాయలు, గోధుమలు, పండ్లు, బంగాళదుంపల ధరలు ఏడాది ప్రాతిపదికన ఏప్రిల్‌లో బాగా పెరిగాయి. ఇది ఆహార ద్రవ్యోల్బణం పెరిగేందుకు కారణం అయ్యాయి. చమురు, విద్యుత్‌ విషయానికొస్తే.. ద్రవ్యోల్బణం రేటు 38.66 శాతం, తయారీ ఉత్పత్తుల టోకు ద్రవ్యోల్బణం రేటు 10.85 శాతం, నూనె గింజల ద్రవ్యోల్బణం 16.10 శాతంగా ఉంది. చమురు, ఆహార వస్తువుల ధరల పెరుగుదల కారణంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం 8 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 7.79 శాతానికి పెరిగింది. ఇది మే 2014లో ద్రవ్యోల్బణం 8.32 శాతంగా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement