హైదరాబాద్: హోమ్ టెక్సటైల్స్ పరంగా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన తయారీ, పంపిణీ సంస్థ, వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్ తమ నూతన పిల్లో (దిండు) ఫ్యాక్టరీని కొలంబస్-సబర్బ్ గ్రోవ్ సిటీ, ఒహియో వద్ద ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీ 70 మంది వ్యక్తులకు ఉపాధి కల్పించనుంది. తమ వినూత్నమైన, పేటెంట్ పొందిన జిఎక్స్ పిల్లోతో సహా సంవత్సరానికి 13.5 మిలియన్ దిండులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని తొలుత ఈ ఫ్యాక్టరీ కలిగి ఉంటుంది.
ఈసందర్భంగా వెల్‌స్పన్ లివింగ్ సీఈఓ అండ్ ఎండి దిపాలి గోయెంకా మాట్లాడుతూ… తమ అతిపెద్ద మార్కెట్లలో యునైటెడ్ స్టేట్స్ ఒకటి, తమ యుఎస్ కస్టమర్‌లకు మెరుగైన సేవలందించే మార్గాల కోసం తాము ఎల్లప్పుడూ వెతుకుతున్నామన్నారు. ఓహియోలోని తమ కొత్త దిండు తయారీ కర్మాగారం, తమ అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించటానికి, మెరుగైన, మరింత ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహించే ఉత్పత్తులతో సహా తమ ఇళ్లలో ఎక్కువగా పెట్టుబడి పెడుతున్న యుఎస్ లోని తమ కస్టమర్ల అవసరాలను మెరుగ్గా తీర్చాలనే విస్తృత వ్యూహంలో భాగమన్నారు.
వెల్‌స్పన్ సీఈఓ గ్లోబల్ బిజినెస్ అండ్ డైరెక్టర్ కెయూర్ పరేఖ్ మాట్లాడుతూ… ఈ వ్యూహాత్మక విస్తరణ సమాజంలో గణనీయమైన ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తూనే, తమ రిటైల్, హాస్పిటాలిటీ భాగస్వాములకు మద్దతు అందించాలనే తమ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. అయన మాట్లాడుతూ… యు.ఎస్ మార్కెట్లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి, తమ వినియోగదారులకు వినూత్నమైన, నాణ్యమైన ఉత్పత్తులను అందించడానికి తాము ఎదురుచూస్తున్నామని వెల్లడించారు.