Friday, November 22, 2024

కోరుకున్న చోట చమురు కొంటాం.. కేంద్ర పెట్రోలియం మంత్రి స్పష్టీకరణ

భారత ప్రభుత్వం తాను కోరుకున్న చోటే ముడి చమురు కొనుగోలు చేస్తుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్‌ సింగ్‌పూరీ స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలకు ఇంధనాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని ఆయన తెలిపారు. రష్యా నుంచి ఆయిల్‌ను కొనుగోలు చేయవద్దని ఏ దేశం తమకు చెప్పజాలదని ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌-రష్యా మధ్య వివాదం వల్ల చమురు సరఫరాలపై ప్రభావం పడింది. వాటి ధరలు పెరుగుతూ వచ్చాయి. అనేక దేశాలు దీని వల్ల తీవ్రంగా నష్టపోయాయి. వాణిజ్య, వ్యాపార ఒప్పందాలపైనా దీని ప్రభావం పడింది. దీని వల్ల చాలా దేశాల ఆర్ధిక వ్యవస్థలపై ప్రభావం పడింది. చమురు, గ్యాస్‌ ధరలు పెరిగి సామాన్యుల పైనా భారం పడింది.

ఈ సంవత్సరం ఏప్రిల్‌ తరువాత రష్యా నుంచి మన దిగుమతులు 50 శాతం పెరిగాయి. మొత్తం మన ఇంధన అవసరాల్లో 10 శాతం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఉక్రెయిన్‌పై దాడి తరువాత పాశ్చత్య దేశాలు రష్యా నుంచి ఇంధనం కొనుగోళ్లను తగ్గించుకుంటూ వచ్చాయి. ప్రస్తుతం అమెరికా ఆదేశాలతో అన్ని దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేశాయి. మన దేశానికి కూడా అమెరికా పలుమార్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని అమెరికా మన దేశాన్ని కోరింది. దీనిపై గతంలో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ సైతం అమెరికా వైఖరిని తప్పుపట్టారు. తాజాగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అత్యధిక జనాభా ఉన్న ఇండియా ఇంధన అవసరాలకు ఏ ఒక్క దేశంపైనా ఆధారపడలేమని ఆయన చెప్పారు. భారత్‌ తాను

కోరుకున్న ఏ దేశం నుంచైనా చమురును దిగుమతి చేసుకుంటుందని చెప్పారు. చివరకు అమెరికా నుంచి కూడా దిగుమతి చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. దీనిపై మన దేశానికి ఒక స్పష్టమైన విధానం ఉందిని చెప్పారు. దేశంలో ఇంధన భద్రత, సరైన ధరలకు వాటిని అందించాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అమెరికా ఇంధన శాఖ మంత్రితో ఆయన గ్రీన్‌ ఎనర్జీపై చర్చలు జరిపారు. ఈ విషయంలో రెండు దేశాలు సర్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం అమెరికా నుంచి మన దేశం 20 బిలియన్‌ డాలర్ల విలువైన ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుందని, దీన్ని మరింత పెంచేందుకు సమావేశంలో చర్చలు జరిగాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement