Friday, November 22, 2024

‘సొంతింటి కల’కు నిరీక్షణ.. రూ.3 లక్షల ఆర్థిక సాయం కోసం వెయిటింగ్​!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సొంత జాగ ఉండి ఇళ్లు కట్టుకోవడానికి ఆర్థిక స్థోమతలేని వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం కింద ఇస్తానన్న రూ.3 లక్షల పథకం కోసం లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. పథకం అందుబాటులోకి వస్తే ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో సొంతిళ్లు నిర్మించుకుందామని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కోసం దాదాపు ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్నారు. గృహనిర్మాణ శాఖ పంపిన లబ్ధిదారులకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదం తెలిపినా ఇంకా ఈ పథకాన్ని ప్రకటించడంలో ప్రభుత్వం మాత్రం వెనుకడుగే వేస్తోంది. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

డబుల్‌ బెడ్‌ రూమ్‌కు దరఖాస్తు చేసుకునే దరఖాస్తుల దారుల సంఖ్య లక్షల్లో ఉంది. వీటికి నిధుల కొరత కూడా ఉంది. మరోవైపు ఇళ్లు పూర్తయినా లబ్ధిదారులకు అప్పగించడంతో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వానికి కూడా ఆర్థిక భారం ఎక్కువవుతోంది. ఈక్రమంలో సొంత జాగ ఉండి అర్హులైన వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకాన్ని సొంతంగా రాష్ట్ర ప్రభుత్వ పథకంగానే అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వ ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే డబుల్‌ ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఇళ్ల విషయంలో కేంద్ర నిబంధనలు అమలు చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడంలేదని తెలుస్తోంది. దాంతో రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై)తో కలిపి అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. పీఎంఏవై నిబంధనలకు లోబడి అమలు చేస్తే కేంద్రం నుంచి నిధులు మంజూరవుతాయి.

ఒక్కో నియోజకవర్గానికి రూ.90 కోట్లు!

- Advertisement -

రూ.3 లక్షల ఆర్థికసాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పైలట్‌ ప్రాజెక్టుగా ఏదేని ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోకుండా 119 నియోజకవర్గాల్లో ఒకే సారి దీన్ని అమలు చేయాలని యోచిస్టున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలుకు ఒక్కో నియోజకవర్గానికి సుమారు రూ.90 కోట్ల మేర నిధులు అవసరం అవుతాయని అధికారులు ఇప్పటికే అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఒక్కో నియోజక వర్గానికి 3000వేల ఇళ్లచొప్పున..ఒక్కో ఇంటికి రూ.3లక్షల మేర ఆర్థిక సాయం చేయడం ద్వారా అన్ని నియోజకవర్గాలకు కలిపి దాదాపు పది వేల కోట్ల మేర నిధులు అవసరం అవుతాయని నిర్ధారణకు వచ్చారు.

అయితే రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని ఒక్కసారిగా ఇవ్వకుండా మూడు నుంచి నాలుగు విడతల్లో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. విడతలవారీగా ఇవ్వడం ద్వారా కొంత ఆర్థికంగా ప్రభుత్వానికి కూడా వెసులుబాటు ఉంటుందని ప్రభుత్వ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 3వేల ఇండ్లను ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించిన నేపథ్యంలో వాటి అయ్యే ఖర్చుపై హౌసింగ్‌ అధికారులు ఇప్పటికే మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డికి గణాంకాలతో సహా వివరించినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన దస్త్రం సీఎం వద్ద ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ పథకాన్ని అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. మొదటి విడత లబ్ధిదారులను ఎంపిక చేసి ఆర్థిక సాయాన్ని కూడా ఇదే ఏడాది వారి ఖాతాల్లో జమ చేయాలని సర్కారు భావిస్తుంది. ఆర్థిక సహకారం అందించడంలో భాగంగా లబ్ధిదారుల ఎంపికకు అర్హతలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉండనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement