కంపెనీ వచ్చే ఏడాది తమ ఉద్యోగుల వేతనాలు 10 శాతం పెంచనున్నాయి. ఉద్యోగులు భారీగా వలసలు పోతున్నందున ఈ మేరకు వేతనాలు పెంచాలని నిర్ణయించినట్లు ఓ నివేదిక వెల్లడించింది. శాలరీ బడ్జెట్ ప్లానింగ్ పేరిట గ్లోబల్ అడ్వైజరీ, బ్రోకింగ్ సొల్యూషన్ కంపెనీ విల్లిస్ టవర్స్ వాట్సన్ దీనిపై ఓ నివేదిక విడుదల చేసింది. గత సంవత్సరం వేతనాల పెంపుదల 9.5 శాతం మాత్రమే. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీలు తమ ఉద్యోగులకు 10 శాతం వేతనాలు పెంచాలని నిర్ణయించినట్లు ఈ నివేదిక తెలిపింది. 58 శాతం కంపెనీలు వేతనాలు పెంచాలని నిర్ణయిస్తే, 24.4 శాతం కంపెనీలు తమ శాలరీ బడ్జెట్లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిర్ణయించాయిని తెలిపింది. 5.4 శాతం కంపెనీలు మాత్రం గత ఏడాది కంటే వేతనాలు తగ్గించాలని చూస్తున్నాయని పేర్కొంది.
168 దేశాలో ఈ సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో సర్వే చేసి ఈ నివేదికను విడుదల చేసింది. మన దేశంలో 590 కంపెనీలు ఈ సర్వేలో పాలుపంచుకున్నాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చూస్తే, భారత్లోనే వేతన పెంపు ఎక్కువగా ఉంటుదని నివేదిక అభిప్రాయపడింది. చైనాలో ఇది 6 శాతం మాత్రమే. హాంకాంగ్, సింగపూర్లో 4 శాతం చొప్పున వేతనాలు పెంచనున్నాయి. రానున్న 12 నెలల్లో తమ వ్యాపారం బాగుంటుందని 42 శాతం కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి. 7.2 శాతం కంపెనీలు మాత్రం ప్రతికూల అభిప్రాయంతో ఉన్నాయి.
ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, టెక్నాలజీ రంగాల్లో 10.4 శాతం, మీడియా రంగంలో 10.2 శాతం, గేమింగ్ లో 10 శాతం వేతనాల పెంపుదల ఉంటుందని నివేదిక తెలిపింది. రానున్న 12 నెలల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్, సేల్స్, సాంకేతిక నైపుణ్యం కలిగిన విభాగాలు, ఫైనాన్స్ రంగాల్లో రిక్రూట్మెంట్లు భారీగా ఉండనున్నాయని నివేదిక పేర్కొంది.
గత సంవత్సరంతో పోలిస్తే మెరుగైన వ్యాపార పనితీరు ఉండటం వల్ల ప్రతిభ కలిగిన ఉద్యోగులను నిలుపుకునేందుకు శాలరీలు పెంచేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఈ సంస్థ ఇండియా ప్రతినిధి రాజుల్ మాథుర్ తెలిపారు. వేతనాలు పెంచకపోవడం వల్ల కోవిడ్ తరువాత ఉద్యోగుల వలసలు భారీగా పెరిగాయి. దీన్ని దృష్టిలో పెట్టకున్న కంపెనీలు మెరుగైన పనితీరు కోసం మంచి ఉద్యోగులు అవసరం ఉందని గుర్తించాయి.