న్యూఢిల్లి : ఎయిరిండియా విమానయాన సంస్థను తిరిగి సొంత గూటికి తీసుకు వచ్చిన టాటా ఇండస్ట్రీస్ , ఉద్యోగులకు వీఆర్ఎస్ ఆఫర్‌ను ప్రకటించింది. సర్వీస్ ఉండగానే పదవీవిరమణ చేసే అవకాశాన్ని కల్పించే వీఆర్ఎస్కు 55 సంవత్సరాలు దాటిన వారు, 20 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన వారు కూడా అర్హులు. నలభై సంవత్సరాలు దాటిన కేబిన్, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న అన్‌స్కిల్డ్ కేటగిరీ వర్కర్స్ కూడా వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎయిరిండియా ఎయిర్‌లైన్స్‌ను మరింత సామర్థ్యంతో ముందుకు నడిపించేందుకు టాటా కంపెనీ పాత సంస్థ ఎయిరిండియా ఉద్యోగులకు వీఆర్ ఎస్ ఆఫర్ ప్రకటించింది. టాటా కంపెనీ నివేదిక ప్రకారం మూడువేల మంది ఉద్యోగులు వీఆర్ఎస్కు అర్హులు. ఎయిరిండియాలో మొత్తం 12,085 మంది ఉద్యోగులుండగా, వారిలో 8,084 మంది పర్మనెంట్, 4,001మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు. రాబోయే ఐదేళ్లలో సుమారు 6,1434 మంది రిటైర్ కానున్నారు.
వీఆర్ఎస్ తీసుకోదలిచిన ఉద్యోగులు జూన్ ఒకటో తేదీ నుంచి జూలై 31 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, ఆ ఏరియా పర్సనల్హెడ్కు సమాచారం ఇవ్వాలని ఎయిరిండియా చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ సురేష్దత్ త్రిపాఠీ ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగులకు నిబంధనల ప్రకారం వన్‌టైమ్ సెటిల్మెంట్ చేస్తుందని వెల్లడించారు. అయితే, ఎయిరిండియాను టాటా గ్రూపులో విలీనం చేయడానికి జరిగిన ఒప్పందంలో ఏడాది లోపు ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించకూడదు, రెండో సంవత్సరంలో వీఆర్ఎస్ ఆఫర్ ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ, ఆ ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా టాటా సంస్థ ఎయిరిండియా ఉద్యోగులకు వీఆర్ఎస్ ఆఫర్ ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..