హైదరాబాద్ (ప్రభన్యూస్) : మహానగరంలో సామాన్య, మధ్య, పేద తరగతి వర్గాల ప్రజలపై ధరల భారం పడుతోంది. ఇటీవలనే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. దీనికి తోడు ‘మూలిగే నక్కపై తాడిపండు’ చందంగా విజయ పాల ధరల భారం పడనుంది. ప్రస్తుతం విజయ టోన్డ్ పాలు అరలీటర్ (500ఎంఎల్) ఎంపీఆర్‌పీ ధర రూ.25 కాగా, పెరిగిన ధరతో రూ.26 ఎంఆర్‌పీ వసూలు చేయనున్నారు. ఈ మేరకు నిత్యం వినియోగించే విజయ పాల ధరలను కూడా పెంచాలని తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటీవ్ ఫైడరేషన్ లిమిటెడ్ నిర్ణయించింది. ఈ నెల 15న అంటే 14న రాత్రి సరఫరా నుంచే లీటర్ పాల పై రూ.2 పెంచుతున్నట్లు ఆ సంస్థ మంగళవారం ఒక ప్రకటనలోతెలిపింది. అయితే జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రతి రోజు 25 లక్షల లీటర్లు పాలను వినియోగిస్తున్నట్లు అంచనా. ఇందులో దాదాపు 18 లక్షలు సంఘటిత రంగం ద్వారా , మిగిలినవి వ్యక్తి గత పాల వ్యాపారాల ద్వారా సరఫరా చేయబడుతున్నాయని సమాచారం.
విజయ, హెరిటేజ్, దొడ్ల, జెర్సీ, తిరుమల, అమూల్, మదర్ డైరీ, నందిని వంటి ప్రముఖ బ్రాండ్స్ ద్వారా దాదాపు 12 లక్షల లీటర్లు సరఫరా అవుతున్నట్లు సమాచారం. ఇందులో ప్రభుత్వం కేవలం 4 లక్షల లీటర్ల పాలు మాత్రమే సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్నాటక నుంచి 2 లక్షల లీటర్ల వరకు పాలు కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా పాలను శివారు జిల్లాలోని ఇబ్రహీంపట్నం, షాద్ నగర్, శంకర్‌పల్లి, భువనగిరి, చౌటుప్పల్ నుంచే వచ్చే పాలు హైదరాబాద్ ప్రజలు సరిపోతున్నాయని అంచనాలు చెబుతుండటం గమనార్హం. అయితే గ్రేటర్ వ్యాప్తంగా ప్రతి రోజు 25 లక్షల పాల వినియోగంలో ప్రభుత్వం అమ్ముతున్నది కేవలం 4 లక్షల లీటర్లుగానే అంచనాలున్నాయి. దీంతో విజయ డెయిరీ పాల ధరల పెంపుతో రోజుకు నగరవాసులపై రూ.8లక్షల భారం పడగా, ప్రతి నెల 2.40 కోట్లకు పైగా భారం పడుతుందనే అంచనాలున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..