దేశంలో గత సంవత్సరం అక్టోబర్‌తో పోల్చితే ఈ సారి అక్టోబర్‌లో వాహన విక్రయాలు 7.73 శాతం తగ్గినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటో డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్‌ఏడీఏ-ఫాడా) తెలిపింది. గత సంవత్సరం అక్టోబర్‌లో 22,95,099 యూనిట్ల వాహనాలు అమ్మకాలు జరిగితే ఈ సారి 21,17,596 యూనిట్ల విక్రయాలు జరిగాయని ఫాడా తెలిపింది. ద్విచక్ర వాహనాల విక్రయాల్లో తగ్గుదల మూలంగానే మొత్తం వాహనాల్లో తగ్గుదల నమోదైందని పేర్కొంది.
ద్విచక్ర వాహనాల అమ్మకాలు గత సంవత్సరం అక్టోబర్‌లో 17,25,043 యూనిట్లుగా ఉంటే, అవి ఈ అక్టోబర్‌లో 12.60 శాతం తగ్గి 15,07,756 యూనిట్లుగా ఉన్నాయి. ప్రయాణికుల వాహన అమ్మకాల్లో 1.35 శాతం తగ్గుదల నమోదైంది. గత ఏడాది 3,58,884 యూనిట్ల విక్రయాలు జరిగితే, ఈ సారి 3,53,990 యూనిట్ల విక్రయాలు జరిగినట్లు ఫాడా తెలిపింది.
త్రిచక్ర వాహన విక్రయాలు మాత్రం గత సంవత్సరం అక్టోబర్‌తో పోల్చితే 45.63 శాతం పెరిగి 1,04,711 యూనిట్లుగా నమోదయ్యాయి. ట్రాక్టర్ల రిటైల్ విక్రయాలు 6.15 శాతం పెరిగి 58,823 యూనిట్ల నుంచి 62,440 యూనిట్లకు చేరాయి. వాణిజ్య వాహనాల రిటైల్ అమ్మకాలు 80,446 యూనిట్ల నుంచి 10.26 శాతం పెరిగి ఈ అక్టోబర్‌లో 88,699 యూనిట్లకు చేరాయని తెలిపింది.
నవరాత్రి సమయంలో వాహన రిటైల్ అమ్మకాల్లో 18 శాతం వృద్ధి నమోదైనట్లు ఫాడా తెలిపింది. ఒక్క ట్రాక్టర్ల అమ్మరాలు మినహా అన్ని రకాల వాహనాల అమ్మకాలు పెరిగాయని తెలిపింది. నవరాత్రి సమయంలో ద్విచక్ర వాహనాల విక్రయాల్లో 22 శాతం, త్రిచక్ర వాహనాల విక్రయాలు 43 శాతం, ప్యాసింజర్ వాహన విక్రయాల్లో 7 శాతం వృద్ధి నమోదైనట్లు ఫాడా పేర్కొంది.