ప్రస్తుతం వందేభారత్ రైళ్లలో కేవలం సిట్టింగ్ మాత్రమే ఉంది. రానున్న రోజుల్లో వందేభారత్ స్లీపర్ కోచ్‌లను కూడా ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. స్లీపర్ కోచ్‌ల కోసం రైల్వే శాఖ మన దేశానికి చెందిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్)తో పాటు, రష్యాకు చెందిన మెట్రో వాగన్‌మాష్ (ఎండబ్ల్యూఎం), లోకోమోటీవ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ (ఎల్‌ఈఎస్) జాయింట్ వెంచర్ అయిన కైనేట్ రైల్వే సొల్యూషన్స్‌తో ఒప్పందం చేసుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం కైనేట్ రైల్వే సొల్యూషన్స్ 120 వందేభారత్ స్లీపర్ ట్రైన్స్‌ను తయారు చేయడంతో పాటు, నిర్వాహణ బాధ్యతలు తీసుకోనుంది. 35 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ సర్వీస్‌ను ఇవ్వనుంది. రష్యాకు చెందిన పలు కీలక రంగాల కంపెనీలపై అమెరికా ఆంక్షల మూలంగా ఈ జాయింట్ వెంచర్ నిర్ణయం ముందుకు సాగుతుందా లేదా అన్న అనుమానాలు వచ్చాయి.
తాజాగా ఒప్పందం కుదరడంతో అనుమానాలు తొలగిపోయాయని సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. సెప్టెంబర్ 14న అమెరికాకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రజరరీ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ (ఓఎఫ్‌ఏసీ) రష్యాకు చెందిన పరిశ్రమలు, ఆర్ధిక సంస్థలపై ఆంక్షలు విధించింది. ఆంక్షలు విధించినప్పటికీ వందేభారత్ రైలు ప్రాజెక్ట్‌క ముందుకు తీసుకుపోతామని కైనేట్ రైల్వే సొల్యూషన్స్ తెలిపింది.
మూడో దేశం ఆంక్షలు వందేభారత్ రైలు ప్రాజెక్ట్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని కైనేట్ స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం తాము దీన్ని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. మరో వైపు చెన్నయ్‌లోని ఐసీఎఫ్ 2024 మార్చి నాటికి మొదటి వందేభారత్ స్లీపర్ ట్రైన్‌ను పట్టాలపైకి తీసుకు వచ్చేందుకు ముమ్మరంగా తయారీ పనులు చేస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ రైళ్లను ఈ ప్లాంట్‌లోనే తయారు చేస్తున్నారు.