అదానీ గ్రూప్‌లోని ఏడు కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడుల మార్కెట్ విలువ రూ.44,670 కోట్లకు పెరిగింది. అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం కనిష్ఠాలకు చేరిన అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువలు మళ్లి పుంజుకోవడమే ఇందుకు కారణం. అదానీ షేర్లలో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ ఏప్రిల్‌లో దాదాపు రూ.5,500 కోట్ల మేర పుంజుకుంది. అదానీ పోర్ట్స్‌లో ఎల్‌ఐసీకి అత్యధికంగా 9.12శాతం షేర్లున్నాయి. ఇక్కడ ఎల్‌ఐసీ విలువ రూ.14,145 కోట్లుగా నమోదైంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎల్‌ఐసీకి ఉన్న 4.25శాతం వాటా విలువ రూ.12,017 కోట్లుగా ఉంది.
అదానీ టోటల్ గ్యాస్, అంబుజా సిమెంట్ కంపెనీల్లో ఎల్‌ఐసీకి రూ.10,500 కోట్ల విలువైన షేర్లున్నాయి. అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ రూ.30,127 కోట్ల పెట్టుబడులు పెట్టగా.. ఈ ఏడాది జనవరి 27కు వీటి విలువ రూ.56,142 కోట్లకు చేరింది. హిండెన్‌బర్గ్ నివేదిక వల్ల ఫిబ్రవరి 23కు ఆ పెట్టుబడుల విలువ దాదాపు రూ.27,000 కోట్లకు పడిపోయినా, మళ్లి కోలుకుంది.