అమెరికా గ్రీన్‌కార్డుల కోసం భారతీయుల క్యూలైన్ భారీగా ఉంది. ప్రస్తుతం ఈ సంఖ్య 10 లక్షలు దాటింది. పెండింగ్‌లో ఉన్న ఈ దరఖాస్తులు పరిష్కారం కావడానికి దశాబ్దాలు పడుతుందని, ఈ ప్రక్రియలో వేచివున్న అభ్యర్థులలో దాదాపు నాలుగు లక్షల మంది మరణించ వచ్చని తాజా నివేదిక ఒకటి తేల్చిచెప్పింది. ఇటీవలి అధ్యయనం ప్రకారం, అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలనుకునే వారికోసం ఇచ్చే గ్రీన్‌కార్డు కోసం ఇప్పటికే 10.7లక్షలకుపైగా భారతీయులు వేచిచూస్తున్నట్లు అంచనా. వివిధ దేశాలపై గ్రీన్‌కార్డు జారీపై ఉన్న పరిమితుల నేపథ్యంలో వీరందరికీ గ్రీన్ కార్డు ప్రక్రియ పూర్తి కావాలంటే దాదాపు 134 ఏళ్ల సమయం పడుతుందట.
ఒకవేళ మరణాలు, వృద్ధాప్యం కారణాలతో ఈ జాబితా నుంచి బయటకు వచ్చే వారిని పరిగణనలోకి తీసుకున్నా.. నిరీక్షణ కాలం 54ఏళ్ల కంటే తక్కువగా కనిపించడం లేదు. ఇదే సమయంలో అక్కడ ఉంటున్న ప్రవాస భారతీయుల పిల్లల వయసును లెక్కిస్తే, వేలాది మంది వారి తల్లిదండ్రులకు దూరమయ్యే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. కాటో ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డేవిడ్.జె.బీర్ అధ్యయనం ప్రకారం, ‘భారతదేశం నుండి కొత్త దరఖాస్తుదారులు ఈ గ్రీన్‌కార్డుల కోసం జీవితకాలం వేచి ఉండవలసి ఉంటుంది. ఇందులో దాదాపు 4,00,000 కంటే ఎక్కువ మంది గ్రీన్ కార్డ్ పొందేలోపు మరణిస్తారు” అని ఈ అధ్యయనం పేర్కొంది.
ప్రతిదేశానికి సగటున గ్రీన్‌కార్డు కేటాయింపు దరఖాస్తుల వార్షిక పరిమితి 7 శాతంగా ఉంది. డిమాండ్ తరచుగా ఈ పరిమితులను మించిపోతున్నది. తద్వారా ఇది గణనీయమైన బ్యాక్‌లాగ్‌కు దారితీస్తుంది. కొత్త భారతీయ దరఖాస్తుదారులకు, గ్రీన్ కార్డ్‌లోని ఈబీ-2, ఈబీ-3 వర్గాలలో బ్యాక్‌లాగ్ ”జీవిత ఖైదు” లాగా మారిందని కాటో ఇన్ట్సిట్యూట్ అధ్యయనం పేర్కొంది. అలాగే, యుఎస్‌లోని లక్ష మందికి పైగా భారతీయ పిల్లలు బ్యాక్‌లాగ్ కారణంగా వారి తల్లిదండ్రుల నుండి వేరు చేయబడే ప్రమాదం ఉంది.
వారు గ్రీన్ కార్డ్ కోసం నిరవధికంగా నిరీక్షిస్తున్నందున, హెచ్-4 వీసా విధానంలో యుఎస్‌లో ఉంటున్న 1.34 లక్షల మంది భారతీయ పిల్లలు 21 ఏళ్లు వచ్చేసరికి వయస్సు దాటిపోతారు. ఇది వారి తల్లిదండ్రుల నుండి బలవంతంగా విడిపోవడానికి దారితీస్తుంది. వారు తల్లిదండ్రుల వద్దే ఉంటాలంటే ఎఫ్-1 విద్యార్థి వీసాను పొందాలి. లేదంటే దేశం నుంచి స్వీయ-బహిష్కరణకు గురవ్వాలని నివేదిక స్పష్టంచేసింది. ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న మొత్తం 18 లక్షల ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ దరఖాస్తుల్లో 63శాతం భారతీయులవే ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది.