యూపీఐ చెల్లింపులు ఊపందుకుంటున్నాయి. వీటి లావాదేవీల విలువ కొత్త శిఖరాలను చేరుకుంటోంది. ఆగస్టు నెల లావాదేవీల విలువ రూ.10.73 లక్షల కోట్లుగా నమోదైంది. జులై నెలలో ఇది రూ.10.63 లక్షల కోట్లుగా ఉండేది. లావాదేవీల సంఖ్య 628 కోట్ల నుంచి 657 కోట్లకు పెరిగాయి. ఈ మేరకు ఆగస్టు నెల డేటాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ విడుదల చేసింది. జూన్‌లో యూపీఐ లావాదేవీలు తొలిసారి రూ.10 లక్షల కోట్ల మార్కును చేరిన సంగతి తెలిసిందే.
- ఆగస్టులో 46.69 కోట్ల ఐఎంపిఎస్ లావాదేవీలు జరగ్గా, వీటి విలువ రూ.4.46 లక్షల కోట్లుగా నమోదైంది. జులైలో ఇది రూ.4.45 లక్షల కోట్లుగా ఉన్నది. మొత్తం లావాదేవీల సంఖ్య 46.08గా రికార్డయింది.
- టోల్ చెల్లింపులకు కీలకమైన ఫాస్టాగ్ లావాదేవీల్లోనూ పెరుగుదల కనిపించింది. జులై (రూ.4,162) నెలతో పోల్చితే ఆగస్టులో ఈ లావాదేవీల విలువ రూ. 4,245 కోట్లకు చేరింది. నికర లావాదేవీలు 26.5 కోట్ల నుంచి 27 కోట్లకు చేరాయి.
- ఆధార్ ఆధారిత లావాదేవీల్లో మాత్రం స్వnల్పంగా తగ్గాయి. జులైలో రూ. 30,199 కోట్ల చెల్లింపులు జరగ్గా ఆగస్టులో ఇది రూ.27,186కోట్లకు క్షీణించింది. సుమారు 10శాతం తగ్గింది. లావాదేవీల సంఖ్య కూడా 11 కోట్ల నుంచి 10.56 కోట్లకు తగ్గాయని ఎన్‌పీసీఐ డేటా వెల్లడించింది.