డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో అగ్రగామిగా వెలుగొందుతున్న యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ప్లాట్‌ఫామ్‌పై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. బ్యాంక్ ఖాతా లేకున్నప్పటికీ, ఒఖరి యూపీఐ ఖాతాను మరొకరు వాడుకునేలా యూపీఐ సర్కిల్ పేరిట కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. డెలిగేట్ పేమెంట్స్‌గా పేర్కొనే ఈ ఫీచర్ గురించి తాజాగా ఓ నోటిఫికేషన్ జారీచేసింది.
ప్రస్తుతం బ్యాంక్ ఖాతా ఉన్నవారు తమ మొబైల్లో యూపీఐ సేవలను వాడుకోవచ్చు. ఎవరి యూపీఐని వారే వినియోగించే వీలుంది. వేరొకరు వాడేందుకు అనుమతి లేదు. కొత్తగా తీసుకొచ్చిన యూపీఐ సర్కిల్‌తో ఒకరి ఖాతాను వేరొకరు వాడుకునే వెసులుబాటు లభిస్తుంది. ప్రైమరీ యూపీఐ ఖాతాను కుటుంబ సభ్యులు లేదా పరిచయం ఉన్న వ్యక్తులతో పంచుకునే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు.. కుటుంబ సభ్యులలో ఎవరైనా బయటకు వెళ్లినప్పుడు వారి లావాదేవీల కోసం ఈ ఫీచర్‌ను వినియోగించొచ్చు. లేదంటే స్కూల్, కాలేజీకి వెళ్లే పిల్లలకు వారి ఖర్చుల కోసం మీ యూపీఐ ఖాతాను పంచుకోవచ్చు. లేదంటే ఇంటి ఖర్చులకు ట్రాక్ చేసేందుకు అందరూ ఒకటే బ్యాంక్ ఖాతాను వినియోగించడానికి ఈ కొత్త ఫీచర్ అనుకూలంగా ఉంటుంది.
బ్యాంకు ఖాతా లేనందున ఇప్పటికీ నగదు లావాదేవీలపై ఆధారపడుతున్న వారిని దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు ఎన్పీసీఐ పేర్కొంది. యూపీఐ యాప్స్, పేమెంట్ సర్వీసు ప్రొవైడర్లు ఈ సేవలను త్వరలోనే అందుబాటులోకి తేనున్నాయి.
పరిమితులు.. నిబంధనలు..
- ఒక ప్రైమరీ యూజర్ గరిష్టంగా ఐదుగురు సెకండరీ యూజర్లను జోడించవచ్చు
- సెకండరీ యూజర్ మాత్రం ఒక ప్రైమరీ యూజర్ ఖాతాను మాత్రమే ఉపయోగించాలి.
- స్రెకండరీ యూజర్ల చెల్లింపులకు ప్రైమరీ యూజర్ నగదు పరిమితి విధించొచ్చు.
- నెలగు గరిష్టంగా రూ.15 వేలు చెల్లింపులు, రూ 5వేల వరకు లావాదేవీలు చేయొచ్చు
- సెకండరీయూజర్ చేసే లావాదేవీలు ప్రైమరీ ఖాతాదారు యూపీఐ యాప్, బ్యాంక్ ఖాతాలో కనిపిస్తాయి.
- చెల్లింపులకు పూర్తి డెలిగేషన్ ఇస్తే, సెకండరీ యూజర్ ఎలాంటి అవాంతరాలు లేకుండా చెల్లింపులు జరపవచ్చు.
- పాక్షిక డెలిగేషన్ ఇస్తే, సెకండరీ యూజర్ నుంచి వచ్చే రిక్వెస్టును ప్రతిసారీ ప్రైమరీ యూజర్ ఓకే చేయాల్సి ఉంటుంది.