Tuesday, November 26, 2024

యూపీఐ చెల్లింపులు 12.11 లక్షల కోట్లు.. 730 కోట్లు దాటిన లావాదేవీలు

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) లావాదేవీలు అక్టోబర్‌లో రికార్డ్‌ స్థాయికి చేరాయి. గత నెలలో 730 కోట్ల లావాదేవీలు జరిగాయని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) వెల్లడించింది. ఈ లావాదేవీల విలువ 12.11 లక్షల కోట్లు అని తెలిపింది. వార్షిక పాతిపదికన లావాదేవీల సంఖ్యలో 73 శాతం, విలువలో 57 శాతం పెరిగాయి. సెప్టెంబర్‌లో జరిగిన లావాదేవీల విలువ 11.16 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. లావాదేవీల సంఖ్య 325 కోట్లు. సెప్టెంబర్‌తో పోల్చుకుంటే అక్టోబర్‌లో లావాదేవీల విలువ 7.7 శాతం పెరిగాయి.

పండగల సీజన్‌ మూలంగానే అక్టోబర్‌లో లావాదేవీల సంఖ్యతో పాటు, విలువ కూడా భారీగా పెరిగాయి. రెండు సంవత్సరాలుగా యూపీఐ లావాదేవీలు విస్తరిస్తూ వస్తున్నాయి. ఈ సంవత్సరం మే నెలలో మొదటిసారి యూపీఐ లావాదేవీల విలువ 10 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. తక్షణ చెల్లింపుల సేవల (ఐఎంపీఎస్‌) ద్వారా ఇంటర్‌ బ్యాంకింగ్‌ నిధుల ట్రాన్స్‌ఫర్‌ అక్టోబర్‌లో 48.25 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ 4.66 లక్షల కోట్లు.

దేశవ్యాప్తంగా ఉన్న టోల్‌గేట్ల నుంచి ఫాస్ట్‌ ట్యాగ్‌ ద్వారా జరిగిని చెల్లింపులు గత నెలతో పోల్చుకుంటే 9.3 శాతం పెరిగాయి. సెప్టెంబర్‌లో ఈ చెల్లింపులు 28.3 కోట్లుగా ఉన్నాయి. ఈ లావాదేవీల విలువ అక్టోబర్‌లో 4,451.87 కోట్ల రూపాయిలు. ఇవి సెప్టెంబర్‌లో 4,244.76 కోట్లుగా ఉన్నాయి. ఆధార్‌ లింక్‌తో జరిగిన బ్యాంకింగ్‌ లావాదేవీలు 11.77 కోట్లు జరిగాయి. ఇవి సెప్టెంబర్‌ నెలలో 10.27 కోట్లుగా ఉన్నాయి. ఈ లావాదేవీల విలువ 31,113.63 కోట్లుగా నమోదయ్యాయి. గత నెలలో జరిగిన లావాదేవీల విలువ 26,665.58 కోట్లుగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement