దేశంలో నిరుద్యోగం రెండేళ్ల గరిష్టానికి చేరింది. ప్రధానంగా అక్టోబర్ నెలలో గ్రామీణ ప్రాంతాలో ఉపాధి లేని వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సెప్టెంబర్‌లో 7.09 శాతం ఉన్న నిరుద్యోగం అక్టోబర్‌లో 10.05 శాతానికి చేరిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామి లిమిటెడ్ (సీఎంఐఈ) అనే సంస్థ తెలిపింది. 2021 మే తరువాత ఈ స్థాయిలో నిరుద్యోగం పెరగడం ఇదే మొదటిసారని పేర్కొంది.
గ్రామీణ ప్రాంత నిరుద్యోగం 6.2 శాతం నుంచి 10.82 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంత నిరుద్యోగం 8.44 శాతానికి చేరింది. దేశంలో చాలా ప్రాంతాల్లో వర్షపాతం 5 సంవత్సరాల కనిష్టంగా నమోదు కావడంతో వరి, చెరకు, గోధుమ పంటల సాగు తగ్గడంతో వ్యవసాయ పనులు తగ్గాయి. పట్టణ ప్రాంతాల్లో ఆర్ధిక వ్యవస్థ కార్యకలాపాలు బలంగా ఉండటం, తయారీ రంగం పుంజుకోవడం, వినియోగ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో నిరుద్యోగం స్వల్పంగా పెరిగిందని నివేదిక వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశవ్యాప్త నిరుద్యోగ రేటుపై వార్షిక ప్రాతిపదికన విడుదల చేస్తోంది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో 2022-23 ఆర్ధిక సంవత్సరంలో నిరుద్యోగం 3.2 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఆర్ధికవేత్తలు మాత్రం సీఎంఐఈ విడుదల చేస్తున్న డేటా వాస్తవాలను దగ్గరగా ఉందని విశ్వసిస్తున్నారు. విశ్లేషణకు ఈ డేటాపై ఆధారపడుతున్నారు.
ఈ సంస్థ దేశవ్యాప్తంగా 1,70,00 కుటుంబాలను సర్వే చేసి ఈ నివేదికను విడుదల చేసింది. మన దేశ ఆర్ధిక వ్యవస్థ 6 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ వృద్ధి దేశంలో ఉన్న లక్షలాది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే స్థాయిలో లేదని ఆర్ధికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్‌లో 10 కోట్ల మంది జాబ్ మార్కెట్లోకి వచ్చారని సీఎంఐఈ నివేదిక తెలిపింది.
వీరంతా ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కువ మందికి ఉపాధిని కల్పించే ఐటీ రంగంలో పలు పెద్ద కంపెనీలు ఈ సంవత్సరం తాము రిక్రూట్‌మెంట్స్‌ను గణనీయంగా తగ్గించుకోనున్నట్లు ప్రకటించాయి. దీని వల్ల ఇంజినీరింగ్ కాలేజీల నుంచి బయటకు వచ్చే ప్రెష్ ఇంజినీరింగ్ విద్యార్ధులు నిరుద్యోగుల జాబితాలో చేరిపోతారని నివేదిక తెలిపింది.