ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ త్వరలో బస్సు సేవలను ప్రారంభించనుంది. దేశ రాజధాని ఢిల్లిలో ముందుగా ఈ సేవలను ప్రారంభం కానున్నాయి. ఢిల్లి ప్రీమియం బస్ స్కీమ్ కింద ఇకపై బస్సులను నడపాలని ఉబర్ నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లి రవాణా మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్ పొందినట్లు తెలిపింది. ఈ తరహా లైసెన్స్ జారీ చేసిన తొలి రవాణా శాఖ ఢిల్లినే.
దీన్ని తీసుకున్న తొలి అగ్రిగేటర్‌గా ఉబర్ నిలిచింది. సంవత్సర కాలంగా ఢిల్లి ఎన్‌సీఆర్ ప్రాంతంతో పాటు, కోల్‌కతాలోనూ ప్రయోగాత్మకంగా ఈ సేవలు నడుపుతున్నట్లు ఉబర్ షిటిల్ ఇండియా హెడ్ అమిత్ దేశ్ పాండే తెలిపారు ఢిల్లిలో బస్సులకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని గమనించినట్లు చెప్పారు. ఇప్పుడు అధికారికంగా ఈ సేవలను ఢిల్లిలో ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు.
బస్సు సర్వీస్‌లకు వారం ముందు నుంచే ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చని దేశ్‌పాండ్ తెలిపారు. బస్సు రానున్న సమయం, బస్సు లైవ్ లోకేషన్, బస్సు రూట్లను ఎప్పటికప్పుడు ప్రయాణికులు తెలుసుకోవచ్చు. ఒక్కో సర్వీస్‌లో 19-50 మంది ప్రయాణించడానికి వీలుంటుంది. ఉబర్ టెక్నాలజీ సాయంతో స్థానిక ఆపరేటర్లు వీటిని నడుపుతారని ఆయన చెప్పారు. కారు టాక్సీ మాదిరిగానే బస్సు సర్వీస్‌లను ఉబర్ నడిపించనుంది.