భారతీయ రిజర్వుబ్యాంక్ రూ.2వేల నోట్లకు రాంరాం చెప్పే పనిలో పడింది. గత రెండేళ్లుగా రూ. 2వేల నోట్లను ముద్రించడం ఆర్‌బీఐ నిలిపివేసింది. క్రమ క్రమంగా ఈ నోట్లను సర్క్యులేషన్ నుంచి ఉపసంహరించుకోవాలని యోచిస్తున్నట్లు కనిపిస్తున్నది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.57,757 నోట్ల విలువ గల రూ.2వేల నోట్లు మార్కెట్‌లో చలామణి నుంచి మాయం అయ్యాయని ఆర్‌బీఐ తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. ఒకవేళ 2019-20లో రూ.2000 నోట్ల విలువ రూ.5,47,952 కోట్లు ఉంటే, 2020-21 నాటికి రూ.4,90,195 కోట్లకు పడిపోయిందని తెలిపింది. 2018 మార్చి నాటికి 336.3కోట్ల రూ. 2వేల నోట్లు చలామణీలో ఉండగా.. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆ సంఖ్య 245.1 కోట్లకు పడిపోయింది. అంటే దాదాపు 91.2కోట్ల నోట్లను ఆర్‌బీఐ వెనక్కి తీసుకుంది.
అంటే గతేడాది కాలంలో రూ.57,757 కోట్ల విలువైన అధిక విలువ గల రూ.2వేల నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది. నకిలీ నోట్లు, ఇతర కారణాల వల్ల ఉపసంహరిస్తున్నారా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. 2018-19 నుంచే ఆర్‌బీఐ రూ.2వేల నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించడం ప్రారంభించింది. అంటే రూ.14,400 విలువైన రూ.2వేల నోట్లను విత్ డ్రా చేసింది.