రెండు వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ మరో రెండు మార్గాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. 2000 నోట్లను మార్చుకునేందుకు ఆక్టోబర్ 7తోనే గడువు ముగిసింది. ఆర్బీఐ తన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో వీటిని మార్చుకునేందుకు వీలు కల్పించింది. అక్టోబర్ 31 నాటికి 97 శాతం 2000 రూపాయల నోట్లు తిరిగి వచ్చాయని, మరో 10 వేల కోట్లు ఇంకా రావాల్సి ఉందని బుధవారం నాడు ఆర్బీఐ ప్రకటించింది.
ఇంకా భారీగానే వెనక్కి రావాల్సి ఉన్నందున ఆర్బీఐ వీటిని మార్చుకునేందుకు మరో రెండు కొత్త మార్గాలను సూచించింది. దగ్గరలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం లేని వాళ్లు రెండు వేల నోట్లను మార్చుకునేందుకు బీమా చేసిన పోస్ట్ సర్వీస్ ద్వారా నోట్లను ఆర్బీఐకి పంపించవచ్చని తెలిపింది.
రెండో విధానంలో ఆర్బీఐ కార్యాలయానికి వెళ్లి క్యూ నిలబడకుండా టీఎల్‌ఆర్ ఫామ్ ద్వారా వేల నోట్లను బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసుకోవచ్చని సూచించింది. బీమా చేసిన పోస్ట్ ద్వారా ఆర్బీఐకి పంపించడం సురక్షితమైన పద్ధతి అని తెలిపింది. దీని వల్ల ఆర్బీఐ ప్రాంతయ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొంది.
టీఎల్‌ఆర్ ఫామ్‌ను ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయంలోని ప్రత్యేక కౌంటర్ వద్ద పొందవచ్చు. ఫామ్‌పై బ్యాంక్ ఖాతా వివరాలు నోట్ల సంఖ్యను రాసి టీఎల్‌ఆర్ ఫామ్ డిపాజిట్ బాక్స్‌లో వేయాల్సి ఉంటుంది. తరువాత ఆర్బీఐ సిబ్బంది వాటిని ఆయా వ్యక్తుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. పోస్ట్ ద్వారా పంపించే కవర్‌లో నోట్లతో పాటు, బ్యాంక్ ఖాతా వివరాలతో ఉన్న ఫామ్‌ను జత చేయాల్సి ఉంటుంది.
దీన్ని ఇన్సూరెన్స్ చేసి ఆర్బీఐ కార్యాలయానికి పంపుకోవచ్చు. వీటితో పాటు వ్యక్తగతంగా ఆర్బీఐ కార్యాలయాల్లో కౌంటర్ వద్ద 20వేల విలువైన నోట్లను మార్చుకోవచ్చు. ఇంకా ప్రజల చేతుల్లో ఉన్న 10వేల కోట్లను కూడా సాధ్యమైనంత త్వరగా వెనక్కి రప్పించేందుకు ఆర్బీఐ అదనపు సదుపాయాన్ని కల్పించింది.