Saturday, November 23, 2024

చైనాకు రెండు రోజులు.. భారత్‌కు రెండేళ్లు..! అమెరికా పర్యాటక వీసా నిరీక్షణ వ్యవధిలో వ్యత్యాసం

అమెరికా పర్యాటక వీసాల జారీ ప్రక్రియలో ప్రాంతాలు, దేశాలను బట్టి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. భారతీయులు పర్యాటక వీసా పొందాలంటే రెండేళ్ల నిరీక్షించాల్సిన పరిస్థితులున్నాయి. అదే సమయంలో చైనా ప్రజలకు వీసా ప్రక్రియ కేవలం రెండు రోజులే కావడం గమనార్హం. పర్యాటక వీసా పొందాలనుకునే ఢిల్లి వాసులు యూఎస్‌ ఎంబసీ అపాయింట్‌మెంట్‌ కోసం సుమారు 833 రోజులు వేచివుండాలి. ముంబై వాసులకు ఈ సమయం 848 రోజులుగా ఉన్నట్లు అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్‌లోని వెయిటింగ్‌ లిస్ట్‌ స్పష్టంచేస్తోంది. అయితే, బీజింగ్‌కు మాత్రం కేవలం రెండు రోజుల్లోనే అపాయింట్‌ మెంట్‌ లభిస్తుంది. ఇస్లామాబాద్‌ వాసులకు 450 రోజులు పడుతుంది. విద్యార్థి వీసాల కోసం వెయిటింగ్‌ సమయం ఢిల్లి, ముంబై వాసులకు 430 రోజులుగా ఉంది. ఆశ్చర్యకరంగా ఈ అంశంలో పాకిస్తాన్‌ పౌరులకు నిరీక్షణ సమయం కేవలం 24 గంటలు మాత్రమే. విద్యార్థి వీసాల్లోనూ చైనాకు అపాయింట్‌మెంట్‌ వెయిటింగ్‌ టైమ్‌ రెండు రోజులే.

వీసాల జారీలో భారత పౌరులను ఏళ్లకు ఏళ్లు నిరీక్షింపజేస్తున్న అంశంపై, అమెరికా పర్యటనలో ఉన్న విదేశాంగమంత్రి జైశంకర్‌, యూఎస్‌ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ వద్ద ప్రస్తావించారు. కాగా, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ప్రపంచ వ్యాప్తంగా ఈసమస్య తలెత్తిందని చెప్పారు. భారత్‌ నుంచి వచ్చే వీసా దరఖాస్తుల సమస్య పరిష్కారానికి తగిన ప్రణాళిక చేస్తామని హామీ ఇచ్చారు. మరొకవైపు కరోనా సమయంలో తక్కువ దరఖాస్తులు రావడం వల్ల సిబ్బందిని తొలగించటమూ ప్రస్తుత సమస్యకు ఒక కారణమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కరోనా తర్వాత పర్యాటక, విద్యార్థి వీసాల దరఖాస్తులు భారీగా పెరిగినట్లు వెల్లడించాయి. భారత్‌నుంచి అమెరికా వెళ్లాలనుకునే నిపుణులు, విద్యార్థులు, పర్యాటకులకోసం అమెరికా ఎంబసీ వివిధ రకాల వీసాలను జారీచేస్తుంది. ఇందుకోసం వీసా అపాయింట్‌మెంట్‌కు పట్టే సమయాన్ని యూఎస్‌ ఎంబసీ వెబ్‌సైట్‌లో సూచిస్తుంది. ఆయా ఎంబసీ, కాన్సులేట్‌లో వీసా ఇంటర్వ్యూలు నిర్వహించే సిబ్బందిని బట్టి ఈ సమయాన్ని ప్రతివారం అప్‌డేట్‌ చేస్తుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement