Saturday, November 23, 2024

బ్లూ టిక్‌ సేవలు ప్రారంభించిన ట్విటర్‌.. మరో నెలలో భారత్‌లోనూ రెడీ

ట్విటర్‌లో పెయిడ్‌ వెర్షన్‌ ట్విటర్‌ బ్లూ సేవలను అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, బ్రిటన్‌లో ప్రారంభమయ్యాయి. తొలుత దీన్ని కేవలం ఐఫోన్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకు వచ్చారు. ట్విటర్‌ బ్లూలో గొప్ప ఫీచర్లను జత చేస్తున్నామని, త్వరలోనే మరిన్ని రానున్నాయని ట్విటర్‌ తెలిపింది. బ్లూ టిక్‌ కావాల్సిన వారు నెలకు 7.99 డాలర్లు చెల్లించాలని తెలిపింది. ఐఫోన్‌ వినియోగదారులకు కంపెనీ నోటిఫికేషన్లు పంపిస్తోంది. బ్లూ టిక్‌ సేవలు కావాల్సిన వారు దీన్ని వినియోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది.

సాధారణంగా కంపెనీలు, సంస్థలు, వ్యక్తులు కూడా ట్విటర్‌ వెబ్‌సైట్‌లో మంచి సమీక్షల కోసం బ్లూటిక్‌ను కోరుకుంటారు. ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారికి ప్రముఖల తరహాలో బ్లూ చెక్‌మార్క్‌తో పాటు, తక్కువ ప్రకటనలు, ఎక్కువ నిడివిగల ఆడియో, వీడియోలను పోస్ట్‌ చేసే అవకాశం వంటి అదనపు ఫీచర్లను అందించనుంది. ఇలా నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభిస్తామని కొత్త యజమాని ఎలాన్‌ మస్‌ ్క ప్రకటించిన నాటి నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ బ్లూ టిక్‌కు పెయిడ్‌ సర్వీస్‌గా మార్చుతున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఆయన ఈ సేవలను ప్రారంభించారు.

ట్విటర్‌లో తరువాత చేయనున్న మార్పులను కూడా ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. రానున్న రోజుల్లో సుదీర్ఘ సందేశాలను కూడా పోస్ట్‌ చేసేలా మార్పులు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం పదాల విషయంలో పరిమితి ఉంది. దీంతో చాలా మంది నోట్‌ప్యాడ్‌లో తమ సందేశాలను రాసి, దాని స్క్రీన్ షాట్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులను తొలగించడానికి పెద్ద పెద్ద మెస్సేజ్‌లను కూడా పోస్ట్‌ చేసేలా మార్పులు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ట్విటర్‌ కంటెంట్‌ క్రియేటర్లకు నగదు అందించే విషయంపై కూడా మస్క్‌ స్పందించారు. యూట్యూబ్‌ ప్రకటనల ఆదాయంలో 55 శాతం కంటెంట్‌ క్రియేటర్లకు ఇస్తోందని ఒక యూజర్‌ ట్విట్‌ చేయడంతో ఆయన స్పందిస్తూ మనం దాన్ని అధిగమించొచ్చు అని చెప్పారు.

ఇండియాలో …

- Advertisement -

ఇండియాలోనూ బ్లూ టిక్‌ సేవలను మరో నెలరోజుల్లో ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఒక ట్విటర్‌ యూజర్‌ అడిగిన ప్రశ్నకు ఆయన దీనిపై స్పందించారు. బ్లూ టిక్‌ సర్వీస్‌కు ఆయా దేశాల ఆర్ధిక స్థితిగతులు, ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగా సబ్‌స్క్రీప్షన్‌ నిర్ణయిస్తామని ఆయన గతంలో ప్రకటించారు. ఇండియాలో బ్లూటిక్‌ సర్వీస్‌కు నెలకు 2 డాలర్ల వరకు ఫీజు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనిపై ట్విటర్‌ ఇంత వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement