భారతీయ మార్కెట్‌లోకి టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్త జూపిటర్ 110 స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.73,700 (ఎక్స్‌షోరూమ్) గా నిర్ణయించారు. డ్రమ్, డ్రమ్ అలాయ్, ఎస్‌ఎక్స్‌సీ, డిస్క్, ఎస్‌ఎక్స్‌సీ ఇలా నాలుగు వేరియంట్లలో ఇది లభిస్తుంది. కొత్త జూపిటర్ 110లో అధునాతన కనెక్షన్ ఫీచర్లున్నాయి.
సీటు, చక్కాల పరిమాణాన్ని మునుపటి వెర్షన్లతో పోలిస్తే కాస్త పెంచారు. సీటు కింద రెండు హెల్మెట్లు పెట్టుకునేంత చోటు కల్పించారు. జూపిటర్‌లోని ఇతర మోడళ్లతోపాటు జూపిటర్ 110లోనూ మైలేజీ సైతం ఎక్కువగానే ఉంటుందని కంపెనీ తెలిపింది. రూ150 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేసిన కొత్త తరం ప్లాట్‌ఫామ్‌పై దీన్ని రూపొందించినట్లు వెల్లడించింది.
డాన్ బ్లూ మ్యాట్, గెలాక్టిక్ కాపర్ మ్యాట్, స్టార్‌లైట్ బ్లూ గ్లాస్ రంగుల్లో ఇది లభిస్తోంది. ఇక భద్రతా ఫీచర్లతోపాటు ఫాలో మీ హెడ్‌ల్యాంప్ అనే కొత్త ఫీచర్ ఇచ్చారు. స్కూటర్‌ను ఆఫ్ చేసిన తర్వాత కూడా చీకట్లో నడిచివెళ్లేందుకు వీలుగా హెడ్‌ల్యాంప్ కొద్దిసేపటి వరకు ఆన్‌లోనే ఉంటుంది.
ఇంధన పొదుపు కోసం ఇంటిగ్రేటెడ్ స్టార్ట్, స్టాప్ వ్యవస్థను ఇచ్చారు. సిగ్నళ్ల దగ్గర తక్కువసేపు ఆపాలనుకుంటే ఇంజిన్ దానికదే ఆఫ్ అయ్యేలా టీవీఎస్ ఇగో ఆప్షన్‌ని పొందుపరిచారు. ఇంధనం నింపేందుకు ఇన్‌లెట్‌ను ముందుభాగంలో అమర్చారు. సింగిల్ సిలిండర్ 4స్ట్రోక్ ఇంజిన్, 6500 ఆర్‌పీఎం వద్ద 5.9 కిలోవాట్ గరిష్ట పవర్ ఉత్పత్తి జరుగుతుంది.