స్పామ్ కాల్స్, మెసేజ్‌లపై కఠిన చర్యలకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. సందేశ సేవల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, మోసపూరిత పద్ధతుల నుండి వినియోగదారులను రక్షించడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని టెల్కోలను ఆదేశించింది. ఈ క్రమంలో 14 సిరీస్‌తో ప్రారంభమయ్యే టెలీ మార్కెటింగ్ కాల్స్‌ను బ్లాక్ చెయిన్ సాయంతో పనిచేసే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (డీఎల్‌టీ)కి మార్చాలని టెలికాం కంపెనీలను ఆదేశించింది.
ఇందుకు సెప్టెంబర్ నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. దీనివల్ల టెలీ మార్కెటింగ్ కాల్స్‌ను నిఘా, నియంత్రణ సాధ్యపడుతుందని ట్రాయ్ అభిప్రాయపడింది. అదేవిధంగా సెప్టెంబర్ 1నుంచి అన్ని టెలికాం కంపెనీలు, వెబ్‌సైట్ లింకులు, ఏపీకే ఫైల్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో కూడిన సందేశాలు చూపించకూడదని కూడా ఈ ఆదేశాల్లో పేర్కొంది. వైట్‌లిస్టు కాని కాల్‌బ్యాక్ నంబర్లు ఉన్నా ఆ సందేశాలు నిలిపివేయాలని సూచించింది.
సందేశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకు కొత్త నిబంధనలు జారీచేసింది. టెలీమార్కెటింగ్ చైన్‌తో సరిపోని, గుర్తు తెలీని నంబర్ల నుంచి వచ్చే సందేశాలను నవంబర్ 1నుంచి పూర్తిగా రిజెక్ట్ చేయాలని కోరింది. టెంప్లాట్‌లను దుర్వినియోగం చేసే విషయంపైనా నిఘా పెట్టింది. సాధారణంగా వ్యాపార సంస్థలు తమ సబ్‌స్క్రైబర్లకు సందేశాలు పంపించేందుకు హెడర్‌లను కేటాయిస్తుంటాయి.
ఒకవేళ ఎవరైనా మెసేజ్ హెడ్‌లు, కంటెంట్ టెంప్లాట్స్‌ను ఉల్లంఘిస్తే, వెంటనే ఆ హెడర్, కంటెట్ టెంప్లేట్స్ నుంచి ట్రాఫిక్‌ను నిలిపివేయాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది. తాజా చర్యలు స్వచ్ఛమైన, సురక్షితమైన సందేశ పర్యావరణ వ్యవస్థను నిర్ధారించడానికి, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, మోసపూరిత కార్యకలాపాలను నిరోధించడానికి తమ ప్రయత్నాలను ముందుకు తీసుకువెళతాయని ట్రాయ్ తెలిపింది.