ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కారు టియాగో ఎలక్ట్రిక్ బుకింగ్ సోమవారం ప్రారంభమయ్యాయి. అధీకృత టాటా మోటార్స్ డీలర్‌షిప్ లేదా వెబ్‌సైట్‌లో రూ. 21,000 టోకెన్ మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా ఈ వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. ఈవీ కార్ల డెలివరీలు వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమవుతాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. టాటా టియాగో ఈవీ కార్లను గత నెల ఆఖరివారంలో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కార్లు కేవలం 5.7 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి. ప్రస్తుతం 10వేల కార్లు మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో 2000 యూనిట్లు పాత వినియోగదారుల కోసం కేటాయించారు.
ఎలక్ట్రికల్ కార్ల మార్కెట్ వాటా పెంచుకోవడంపై కన్నేసిన టాటా మోటర్స్.. ఇప్పటికే నెక్సీన్ ఈవీ, టిగోర్ ఈవీ కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గత నెలలో తన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ కారు టియాగో ఈవీ వెర్షన్‌ను ఆవిష్కరించి మంచి ఊపుమీదున్నది. టిగోర్ ఈవీ కంపాక్ట్ సెడాన్ కాగా, నెక్సాన్ ఈవీ కంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్. తాజాగా మార్కెట్లోకి వచ్చిన ఈవీ కారు హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌కు చెందినది.