హైదరాబాద్ ప్రతినిధి, (ప్రభన్యూస్) : గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో దసరా పండుగను పురస్కరించుకొని రానున్న మూడు రోజుల్లో రికార్డుస్థాయిలో లిక్కర్ విక్రయాలు సాగించాలని టార్గెట్‌గా నిర్ణయించారు. గడిచిన ఏడాది దసరా సందర్భంగా ఐదురోజుల్లో మూడు జిల్లాల్లో రూ.120కోట్లకుపైగా విక్రయాలు జరిగాయి. అందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.58కోట్లు, హైదరాబాద్ జిల్లాలో రూ.42కోట్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రూ.30కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.
ఈసారి దసరా మూడురోజుల ముందు ఆదివారం అంటే ఈ రోజున గాంధీ జయంతి ఉన్నందున మద్యం విక్రయాలు జరగవు. ఇక మిగిలిన మూడు రోజుల్లోనే రూ.200కోట్లు జరపాలని టార్గెట్‌గా నిర్ణయించారు. గత ఏడాది తెలంగాణ వ్యాప్తంగా దసరాకు ఐదురోజుల ముందు రూ.685కోట్ల విక్రయాలు జరగగా టాప్ టూ జిల్లాలుగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలే నిలిచాయి. ఈసారికూడా గడిచిన ఏడాది కంటే రెండింతల అమ్మకాలు గ్రేటర్ జిల్లాల్లో జరిగేలా ఆబ్కారి శాఖ కసరత్తు చేస్తోంది.